కాలుష్యాన్ని మింగేసే ట్విస్టింగ్‌ టవర్స్‌

కాలుష్యాన్ని మింగేసే ట్విస్టింగ్‌ టవర్స్‌


తైపీ :

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ వృద్ధి చెందుతోన్న నగర జనాభాతో పాటూ కాలుష్యం కూడా అదే రీతిలో పెరుగుతోంది. జనాభా పెరుగుతుంది కానీ, భూమి పెరగదు. అందుకే ప్రత్యామ్నాయాల కోసం మనిషి అన్వేషణ మొదలైంది. అదే వర్టికల్ ఫార్మింగ్. అంటే అద్దాల మేడల్లో వ్యవసాయం చేయడం. వర్టికల్‌ ఫార్మింగ్‌ పద్దతిలో ఇప్పటికే చాలా దేశాల్లో భవంతులు నిర్మిస్తున్నారు. వర్టికల్‌ ఫార్మింగ్‌తో పాటూ భవంతి పైభాగం నుంచి కింది భాగం వరకు ఏకంగా 90 డిగ్రీలు తిరిగేలా తైవాన్‌లో ఓ భారీ ప్రాజెక్టును చేపట్టారు.



ఈ కాలుష్యాన్ని మింగేసే ట్విస్టింగ్‌ టవర్స్‌ను .. తావో జు యిన్‌ యువాన్‌ టవర్‌ లేదా అగోరా గార్డెన్‌గా పిలుస్తారు. తైపీలోని క్సిన్‌ యి జిల్లాలో 20 అంతస్తుల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అగోరా గార్డెన్‌ ముఖభాగం, పైకప్పు, బాల్కనీల్లో దాదాపు 23,000 చెట్లు, మొక్కలు, పొదలను పెంచడానికి అనువుగా నిర్మిస్తున్నారు. న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్‌లో ఉన్న మొత్తం చెట్లకు ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. భవంతి మధ్యలో 40 లగ్జరీ సముదాయాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్లు ఏడాదికి దాదాపు 130 టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ను శోషించుకోగలవని నిపుణులు అంచనా వేశారు. 130 టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను తగ్గించడమంటే 27 కార్లను ఏడాది పాటు తిప్పడం ఆపేసినట్లు అవుతుందట.





అగోరా గార్డెన్‌ విశిష్టతలు:

455, 694 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవంతి అడుగు నుంచి టాప్‌ ఫ్లోర్‌కు 90 డిగ్రీల కోణం వరకు తిరిగేలా నిర్మాణలను చేపట్టారు.



బాల్కనీలోనే కాకుండా టవర్స్‌ లోపలి భాగంలో కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంది. గ్లాస్‌ ఫ్లోరింగ్‌ పక్కనే చెట్లు ఉండి.. ప్రకృతితో మమైకమైన అనుభూతిని ఈ భవంతి కలిగిస్తుంది.



ప్రతి యూనిట్‌లో ఓ లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ రూమ్‌, ఫ్యామిలీ రూమ్‌, కిచెన్‌, ప్రత్యేక బెడ్‌ రూమ్‌లు ఉంటాయి.



ఇక డాబా పైకి వచ్చి చూస్తే సుందరమైన తైపీ నగరం దర్శనమిస్తుంది.



ఈ నిర్మాణంలోపలే ఓ విశాలమైన స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఉంది.



కాలుష్య నివారణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కలను పెంచడానికి అనువుగా నిర్మాణాలు చేపట్టే ప్రముఖ బెల్జియన్‌ ఆర్కిటెక్ట్‌ కల్లెబట్‌ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు చేపట్టారు.



2013లో ప్రారంభమైన ఈ భవంతి టాప్‌ ఫ్లోర్‌ గత జూలైలో పూర్తయింది. మొక్కలు పెంచితే కింద చూపించిన విధంగా ఈ కాంక్రీటు నిర్మాణం పచ్చగా మారనుంది.











 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top