మలేరియా నివారణకు మంచి చిట్కా

మలేరియా నివారణకు మంచి చిట్కా

 స్టాక్‌హోమ్: మనం కోళ్ల ఫారాలకు వెళ్లినప్పుడు లేదా కోళ్ల గంప వద్ద కూర్చున్నప్పుడు వచ్చే ఒక విధమైన వాసనను తట్టుకోలేక అబ్బా కోళ్ల కంపు! అని ముక్కు మూసుకుంటాం. నొసలు చిట్లిస్తాం. అలవాటు పడకపోయినా మనం అంతో ఇంతో ఆ వాసనను భరించగలం. అదే మలేరియా నుంచి ఇటీవల బయటపడిన ప్రాణాంతక జికా వైరస్ వరకు వ్యాధులను సంక్రమింప చేస్తున్న దోమలైతే కోళ్ల కంపును అసలు తట్టుకోలేవని, కోళ్ల కంపుకు ఆమడ దూరం పారిపోతాయని ఓ తాజా పరిశోధనలో తేలింది. 


 


స్వీడన్‌లోని అగ్రికల్చర్ సైన్స్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న అనాఫెలెస్ అరేబియెన్సిస్ జాతి దోమలు మానవులకే కాకుండా ఇతర జంతువులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై పరిశోధనలు చేయాలనుకున్నారు. అందులో భాగంగా మలేరియా వ్యాధి ఎక్కవగా ఉన్న సబ్ సహారా ఆఫ్రికాలో మలేరియాకు కారణమవుతున్న జాతి దోమల రక్తాన్ని పరిశీలించారు. ఆశ్చర్యంగా వాటిలో కోళ్ల రక్తం మినహా మిగతా ఫారమ్ జంతువుల రక్తాల నమూనాలు దొరికాయి. ఎందుకు దోమలు కోళ్లను కుట్టడం లేదు? ఎందుకు వాటి రక్తాన్ని పీల్చుకోవడం లేదు? కోళ్ల పక్కన పడుకునే మనుషులపై అవి దాడి చేస్తాయా, లేవా? అన్న దిశగా మరిన్ని పరిశోధనలు చేయాలనుకున్నారు. 


 


ఈ ప్రయోగానికి స్వచ్ఛందంగా సంసిద్ధత వ్యక్తం చేసిన  మనుషులను ఎంపిక చేసి వారిని దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కోళ్లతో సహా గొర్రెలు, మేకలు లాంటి ఫారమ్ జంతువుల పక్కన పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి 1,172 దోమలను సేకరించి వాటిలోని రక్తం నమూనాలను పరిశీలించారు. వాటిల్లో దాదాపు అన్ని దోమల్లో  బాధిత మనుషులు, జంతువుల రక్తం నమూనాలు దొరికాయి. ఒకే ఒక్క దోమలో మాత్రమే కోడి రక్తం దొరికింది. అలాగే కోళ్లు, ఇతర జంతువుల పక్కన పడుకున్న వారి నుంచి కూడా రక్తం నమూనాలను సేకరించి దోమల కుట్టిన ఆనవాళ్లను తెలుసుకున్నారు. కోళ్ల పక్కన పడుకున్న వారిలో 85 శాతం మందికి దోమలు అసలు కుట్టలేదని, మిగతా జంతువుల పక్కన పడుకున్న వారికి కూటికి నూరు శాతం దోమలు కుట్టాయని తెల్సింది. 


 


 ఈ ప్రయోగం ద్వారా దోమలు కోళ్లనే కాకుండా, కోళ్ల పక్కన పడుకున్న వారిని కూడా కుట్టడం లేదని తేలింది. దోమలకు కోళ్ల రక్తం నచ్చకపోతే, కోళ్ల పక్కన పడుకున్న వారిని ఎలా వదిలేశాయన్న ప్రశ్న పుట్టుకొచ్చింది. దీంతో కోళ్ల రక్తం కాకుండా కోళ్ల కంపుకు, దోమలు కుట్టకపోవడానికి ఏదో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గ్రహించారు. వెంటనే మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. 


 


ఈ సారి కోళ్లను, జంతువులను కాకుండా వాటి వాసన వచ్చేలా వాటి ఈకలను, చర్మాన్ని సేకరించి, వాటికి సమీపంలో వాలంటీర్లను పడుకోబెట్టారు. ఆశ్చర్యంగా ఈసారి కోళ్ల వాసన పక్కన పడుకున్న మనుషుల్లో 95 శాతం మందికి మలేరియా వ్యాధికి కారణం అవుతున్న దోమలు కుట్టలేదు. అంటే కోళ్ల కంపు  మస్కిటో రిపెల్లెంట్స్ గా పనిచేస్తున్నట్లు స్పష్టమైంది. ప్రస్తుతం తాము అనాఫెలెస్ అరేబియెన్సిస్జాతి దోమలపైనే పరిశోధనలు జరిపామని, పలు వైరస్ రోగాలకు కారణమవుతున్న అన్ని దోమల జాతులపై తదుపరి ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని మలేరియా జర్నల్ లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 


 


భవిష్యత్తులో కోళ్ల కంపునే ఆల్ అవుట్ గుడ్‌నైట్ లాంటి మస్కిటో రిపెల్లెంట్స్‌లో మందుగా మన ముందుకు వస్తుందని ముందుగానే ఊహించవచ్చు. అప్పటి వరకు నిరీక్షించలేని వాళ్లు కోళ్ల పక్కన పడుకుంటే సరిపోతుందేమో!


 


 


 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top