ప్రాణాలు రక్షించిన 'కాల్ సెంటర్'

ప్రాణాలు రక్షించిన 'కాల్ సెంటర్' - Sakshi


వేళాపాళా లేకుండా వ్యాపార సంస్థల కాల్ సెంటర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు చిర్రెత్తుకొస్తుంది. కొన్నిసార్లు ఫోన్ చేసిన వాళ్లను చెడామడా తిట్టేస్తాం కూడా. అయితే లాస్ వేగస్ నుంచి 1448 కిలోమీటర్ల దూరంలోని ఓరగాన్ (లెబనాన్) పట్టణానికి అలా వెళ్లిన ఓ కాల్ ఆపదలో ఉన్న ఓ యువతి ప్రాణాలను కాపాడింది. దాంతో ఎప్పుడూ తిట్లు తినే ఆ కాల్ సెంటర్ ఉద్యోగులను ప్రశంసల జల్లు ముంచెత్తింది. ఓరేగాన్ పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.....అమెరికేర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కాల్ సెంటర్ నుంచి చమెల్లీ మ్యాక్ ఎలోరి అనే ఉద్యోగిని తన విధి నిర్వహణలో భాగంగా ఇటీవల లెబనాన్‌లోని ఓరెగాన్ పట్టణంలోని ఓ సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసింది. అవతలి వైపు నుంచి 'హలో' అని వినిపించకుండా రక్షించండంటూ ప్రాణభీతితో ఓ యువతి చేసిన ఆర్తనాదాలు  వినిపించాయి. ఎలోరి ఫోన్ పెట్టేయకుండా తన సూపర్‌వైజర్ టినా గ్రేషియాకు ఈ విషయం తెలియజేసింది. అతను వెంటనే విషయాన్ని కంపెనీ సీఈవో మారియో గోంజాలెజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఫోన్‌లో వినిపిస్తున్న ఓ యువతి ఆర్తనాదాలు విన్నారు. వెంటనే ఈ విషయాన్ని లాస్ వేగస్ పోలీసులకు తెలియజేయాలనుకున్నారు. దీనికి బదులుగా ఓరేగాన్‌లోని స్థానిక పోలీసులకు తెలియజేయడమె మంచిదని భావించి అప్పటికప్పుడు సమాచారాన్ని అక్కడికి చేరవేశారు.



మారియో ఫోన్‌కాల్‌ను రిసీవ్ చేసుకున్న ఓరెగాన్ పోలీసులు తక్షణమే స్పందించి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆపదలో ఉన్న యువతి చిరునామాను కనుక్కొని ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లగానే 33 ఏళ్ల వాల్టర్ వారెన్ జాన్‌రుక్ తన భార్యను వెనక నుంచి గట్టిగా పట్టుకొని హింసిస్తుండడం కనిపించింది. పోలీసులు అతన్ని రివాల్వర్లతో బెదిరించి అదుపులోకి తీసుకున్నారు. దిండ్లతో, బ్లాంకెట్లతో తనను ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించాడని, ఆ ప్రయత్నం నుంచి తప్పించుకుంటే గుండెకు రివాల్వర్‌ను ఎక్కుపెట్టి చంపేస్తానని బెదిరించాడని, అదే సమయంలో తన వెనుక జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగిందని, దాన్ని జాన్‌రుక్‌కు తెలియకుండా ఆన్ చేశానని బాధితురాలు జరిగిన విషయాన్ని వివరించారు. నిందితుడిని లిన్ కౌంటీ జైలుకు తరలించిన ఫోలీసులు అమెరికేర్ హెల్త్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి సకాలంలో స్పందించిన కెంపెనీ సీఈవో, ఉద్యోగులను ప్రశంసించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top