బోటు మునక: 700 మంది గల్లంతు

మధ్యదరా సముద్రంలో రబ్బరు బోట్ల ద్వారా ఆఫ్రికా నుంచి యూరప్ వలసవెళుతోన్న శరణార్థులు (ఫైల్ ఫొటో)


పట్టెడన్నం కోసం పక్కదేశానికి వలస వెళ్లాలనుకున్న వెతజీవులు సముద్రంలో గల్లంతయ్యారు. ఒకరుకాదు ఇద్దరు కాదు  దాదాపు 700 మంది నీటమునిగారు. వలసల చరిత్రలో అత్యంత విషాదంగా భావిస్తోన్న ఈ ఘటన మద్యదరా సముద్రంలో ఆదివారం జరిగింది. గడాఫీ మరణం తర్వాత కల్లోలితంగా మారిన లిబియా నుంచి చేపలు పట్టే బోట్ల ద్వారా ఇటలీకి బయలుదేరిన 700 మంది కూలీలు మధ్యదరా సముద్రంలో నీట మునిగారని ఇటలీ నౌకాదళం భావిస్తోంది.


 


ఘటనా స్థలికి చేరుకున్న నౌకా దళం.. 28 మందిని కాపాడగలిగింది. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడగలిగే అవకాశాలు తక్కువేనని మెరైన్ అధికారులు చెబుతున్నారు. ' లిబియా తీరం నుంచి ఇటలీలో భాగంగా ఉన్న లంపేడుసా ద్వీపానికి బయలుదేరిన శరణార్థులు.. చేపలు పట్టే బోటులో పరిమితికి మించి ప్రయాణించారు. ఓ వ్యాపారనౌక వీరు ప్రయాణిస్తోన్న బోటుకు దగ్గరగా రావడంతో ప్రమాదం సంభవించింది. దీంతో బోటు తలకిందులై 700 మంది గల్లంతయ్యారు' అని ఐక్యరాజ్యసమితి సహాయ పునరావాస సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రమాద స్థలం నుంచి 28 మందిని కాపాడగలిగామని, మిగతావారి కోసం గాలింపుచర్యలు చేపట్టామని, అయితే దాదాపు వారు చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోన్న ఇటాలియన్ కోస్ట గార్డ్ ఆఫీసర్ వివరించారు.


 


ఆఫ్రికా, పశ్చిమాసియా నుంచి యూరప్ కు వలసవెళుతూ ఇలా మధ్యధరా సముద్రంలో మరణించిన శరణార్థుల సంఖ్య ఇప్పటికే 1500 కు చేరుకోవడం శోచనీయం. గత ఫిబ్రవరిలో రబ్బరు బోట్లు ప్రమాదానికి గురికావడంతో ఇటలీవైపు వెళుతోన్న 300 మంది వలసదారులు జలసమాధి అయ్యారు. గతేడాది సెప్టెంబర్ లో ఇదేవిధంగా 500 మంది నీటమునిగారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top