ఎమర్జెన్సీ ల్యాండింగ్ విఫలం... కూలిన విమానం

ఎమర్జెన్సీ ల్యాండింగ్ విఫలం... కూలిన విమానం


తైవాన్‌లో దుర్ఘటన; 47 మంది మృతి!

గాయాలతో బయటపడ్డ 11 మంది  ప్రతికూల వాతావరణమే కారణం




తైపే: మలేసియా విమాన దుర్ఘటనను మరచిపోకముందే మరో విమాన దుర్ఘటన చోటుచేసుకుంది. మాత్మో తుపాను వల్ల భారీ వర్షాలు కురుస్తున్న తైవాన్‌లో బుధవారం రాత్రి ఓ విమానం ప్రతికూల వాతావరణంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ విఫలమై ఎయిర్‌పోర్టు వెలుపల కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 47 మంది మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 11 మంది గాయాలతో బయటపడ్డట్లు చెప్పారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... కోసియంగ్ నగరం నుంచి 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో పెంఘూ దీవిలోని మగాంగ్‌కు సాయంత్రం 4:53 గంటలకు బయలుదేరిన ట్రాన్స్‌ఏసియా ఎయిర్‌వేస్ విమానం రాత్రి 7 గంటల సమయంలో మగాంగ్ ఎయిర్‌పోర్టు సమీపానికి చేరుకుంది. అయితే భారీ వర్షంలో రన్‌వే సరిగా కనిపించకపోవడంతో పైలట్ తొలిసారి ల్యాండింగ్‌కు యత్నించి సాధ్యం కాకపోవడంతో విమానాన్ని తిరిగి గాల్లోకి లేపాడు.



రెండోసారి ల్యాండింగ్ చేస్తానంటూ రాత్రి 7:06 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు పైలట్ సమాచారం ఇచ్చాక విమానంతో ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. ఆ వెంటనే విమానం ఎయిర్‌పోర్టుకు వెలుపల జీజీ అనే గ్రామంలో కుప్పకూలింది. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి 11 మందిని కాపాడారు. కాగా, ఈ ప్రమాదానికి ముందే రెండు విమానాలు ఎయిర్‌పోర్టులో సాయంత్రం 5:34 గంటలకు, రాత్రి 6:57 గంటలకు ల్యాండ్ అయినట్లు అధికారులు చెప్పారు. రెండు ఇంజన్ల టర్బోప్రాప్ ఏటీఆర్-72 రకానికి చెందిన జీఈ 222 అనే ఈ విమానం 14 ఏళ్ల నాటిదన్నారు. 2013 అక్టోబర్‌లో దక్షిణ లావోస్‌లో భారీ తుపానులో చిక్కుకున్న ఓ విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలోని 49 మంది మృతిచెందారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top