రాజధానిపై వరద ప్రకోపం, 312 మంది మృతి

రాజధానిపై వరద ప్రకోపం, 312 మంది మృతి


ఫ్రీటౌన్‌: సియర్రా లియోన్‌ పేదరికంతో కొట్టుమిట్టాడే ఓ ఆఫ్రికన్‌ దేశం. దీని రాజధాని ఫ్రీటౌన్‌. దేశ ఆర్థిక ప్రగతి మొత్తం రాజధానిలోనే కేంద్రీకృతం కావడంతో దాదాపు 12 లక్షల మంది జనాభాతో ఫ్రీటౌన్‌ కిక్కిరిసి ఉంటుంది. అలాంటి నగరంపై ప్రకృతి తన ప్రకోపాన్ని చూపింది. చిక్కిపోయిన దేహాలతో ఉండే సగటు ఫ్రీటౌన్‌ వాసి ప్రాణాలను అరచేత పట్టుకుని, ఇళ్లను వదిలి కొండలను ఎక్కాల్సిన పరిస్థితిని కల్పించింది.



సోమవారం ఫ్రీటౌన్‌పైకి దూసుకొచ్చిన రాకాసి వరద 312 మందిని పొట్టన పెట్టుకుంది. భారీ మొత్తంలో వచ్చిన వరద నీటితో పాటు పెద్ద ఎత్తున వచ్చిన ఎర్ర మట్టి ప్రజల పాలిట శాపంగా మారింది. ఒట్టి వరదైతే తప్పించుకోవడానికి కొంత సులువుగా ఉండేది. కానీ, నీటితో పాటు వచ్చిన మట్టి మనుషులను చుట్టేసి తనలో కలిపేసుకుంది.



నగరంలోని ఏ వీధిని చూసిన నిశ్శబ్దం. కుప్పలు తెప్పలుగా పడివున్న శవాలు. వీటన్నింటిని చూసిన పత్రికా విలేకరికి కన్నీళ్లు ఆగలేదు. సగానికి పైగా తెగిపోయిన మనుషుల శరీరాల నుంచి బయటకు వస్తున్న ఎర్రమట్టి ఆయన్ను అక్కడే కూలబడిపోయేలా చేసింది. ఆ హృదయ విదారక సన్నివేశాలను కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో సాయం కోసం పోస్టు చేశారు.





వేల సంఖ్యలో సహాయకులు అవసరమని ఫ్రీటౌన్‌ ప్రజలను కాపాడాలని అభ్యర్థించారు. వరద వల్ల దాదాపు 2000లకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. నగరానికి చేరువలోని పర్వతాలపైకి ఎక్కిన కొందరు ప్రాణాలను రక్షించుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. ఇప్పటికే వందల సంఖ్యలో మృతదేహాలను ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.





Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top