ఒక్కొక్కరికి 2 కోట్ల డాలర్ల సర్కారీ నిధులు!

ఒక్కొక్కరికి 2 కోట్ల డాలర్ల సర్కారీ నిధులు! - Sakshi


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కేవలం ప్రచార పర్వానికే ప్రధాన పార్టీలు, అభ్యర్థులు దాదాపు 200 కోట్ల డాలర్లు వ్యయం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు ఖర్చుల కోసం నిధులు సేకరించుకోవడమే కాదు.. అర్హులైన అభ్యర్థులకు ప్రైమరీల్లో ప్రచారానికి, సాధారణ ఎన్నికల్లో ప్రచారానికి ప్రభుత్వం కూడా నిధులు అందిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు కోట్ల డాలర్లకు పైగా ప్రభుత్వ నిధులు పొందడానికి అర్హులు.



 అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం.. అధ్యక్ష పదవికి పోటీపడే అధికారిక అభ్యర్థులు తమ ప్రచారానికి సేకరించిన నిధుల జమా ఖర్చుల వివరాలను ప్రతి నెలాఖరులో లేదా మూడు నెలలకోసారి సమాఖ్య ఎన్నికల సంఘానికి (ఎఫ్‌ఈసీకి) సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలను పరిశీలించిన తరువాత వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తారు. ఒక్కో వ్యక్తి నుంచి 5,400 డాలర్ల వరకూ స్వీకరించవచ్చు. స్వతంత్ర వ్యయ కమిటీలుగా (సూపర్ పీఏసీలు) పిలిచే కొత్త తరహా రాజకీయ కార్యాచరణ సంస్థలు కార్పొరేషన్లు, యూనియన్లు, వ్యక్తుల నుంచి చాలా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి తాము మద్దతిస్తున్న పార్టీ లేదా అభ్యర్థికి నిధులు అందిస్తాయి. దీనిపై గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక  చాలా కాలంగా ఉన్న పీఏసీలుగా పిలిచే రాజకీయ కార్యాచరణ సంస్థలు కూడా నిధుల సేకరణలో కీలక భూమిక పోషిస్తాయి. కొన్ని పీఏసీలను అభ్యర్థులే స్వయంగా నడుపుతారు. కొన్నిటిని పార్టీలు నడుపుతాయి. అలాగే వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన లాబీయింగ్ బృందాలు కూడా పీఏసీలను నిర్వహిస్తాయి. వీటి నిధుల సేకరణ, వ్యయం వివరాలను ఎఫ్‌ఈసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది.



 తాజా ఎన్నికల కోసం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ నెల 12వ తేదీ వరకూ 42 కోట్ల డాలర్లకు పైగా వ్యయం చేశారు. అందులో న్యాయవాదుల సంస్థలు, న్యాయవాదుల నుంచి సేకరించిన విరాళాలదే సింహభాగం. కమర్షియల్ బ్యాంకుల నుంచీ గణనీయంగా విరాళాలు లభించాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ ఇదే సమయానికి దాదాపు 15 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారు. అందులో సేకరించిన నిధులే కాకుండా సొంత డబ్బులూ ఉన్నాయి.

 

 అధ్యక్ష ఎన్నికల టైమ్‌లైన్...

 నవంబర్ 8 - సార్వత్రిక ఎన్నికలు: ఓటర్లు అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా తమ తమ రాష్ట్రాల నుంచి ఎలక్టోరల్ కాలేజీకి ఎలక్టర్లను ఎన్నుకుంటారు.

 డిసెంబర్ 16 - ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లు తమ తమ రాష్ట్రాల నుంచి ఓట్లు వేయడం ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

 జనవరి 6 - అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి, ఫలితం ప్రకటిస్తారు.

 జనవరి 20 - ఎన్నికైన అభ్యర్థి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపడతారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top