గ్రీస్ నుంచి మన గల్లీలోకి..

గ్రీస్ నుంచి మన గల్లీలోకి.. - Sakshi


మోడీ... ఈ పేరు విన్నారా..? అని ప్రశ్నిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ‘విన్నాం’ అని కోట్ల గొంతులు నినదిస్తాయి.  ఎందుకంటే అది మన దేశ ప్రధాని పేరు కదా. ‘మాకూ తెలుసు’ అని విదేశాల నుంచి కూడా సమాధానం వస్తుంది.  కానీ మీరు మన పాతనగరంలోని పచారీ కొట్ల వద్దకు వెళ్లి ‘మోడీ..’ అనండి... ‘ఎంతకావాలి..?’ అన్న ఎదురు ప్రశ్న వినిపిస్తుంది. ఇదేంటీ... అని ఆశ్చర్య పోకండీ..మొండి వ్యాధులకు సైతం హడలెత్తించే ఆ.. మోడీ యుునానీ వైద్యంలో కీలకమైంది.

 

పిప్పళ్లు, షాజీరా,  జాజికాయ, జాపత్రి.... ఇప్పటి తరానికి ఇవి వింతగొలిపేవే. మోడీ కూడా వీటిల్లో భాగమే. పాతనగర వీధుల్లోకి అడుగు పెడితే వాటిని భద్రపరిచిన డబ్బాలతో నిండిన చిన్నచిన్న దుకాణాలు ఎన్నో కనిపిస్తాయి. కొనుగోలుదారులూ నిండుగా ఉంటారు.  శారీరక రుగ్మతలను నయుం చేయుగల అద్భుత ఔషధ గుణాలు వాటి సొంతం. మన సంప్రదాయ వైద్యవిధానం ఆయుర్వేదం తరహాలోనే యునానీ ప్రసిద్ధమైందే. పైన చెప్పిన పదార్థాలన్నీ ఈ వైద్యవిధానంలో ఓషధులే. భాగ్యనగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలు దీనికి పట్టం కట్టారు.

 

కీళ్లవ్యాధులు, కామెర్లు, లివర్ సంబంధ సమస్యలు, నరాల బలహీనతలు, ఆస్తమా... ఒకటేమిటి.. ఎన్నో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది నేటికీ యునానీపైనే ఆధారపడుతున్నారు. వీటి కి వైద్యం చేయటంలో చేయితిరిగిన వారనే ఘనతను మూటగట్టుకున్న హకీం(వైద్యులు)లు పాతనగరంలో బిజీగా కనిపిస్తుంటారు. ముస్లిం కుటుంబాలు ఎక్కువగా నమ్మే ఈ వైద్య విధానం కేవలం వారికే పరిమితం కాలేదు. ఇతర మతస్థులు కూడా  ఆశ్రరుుస్తుండడంతో నేటికీ యునానీకి ఆదరణ కొనసాగుతోంది. అందుకే పాతనగరంలో ప్రభుత్వ యునానీ ఆసుపత్రి సేవలందిస్తోంది.

 

గ్రీస్ నుంచి వచ్చిందిలా...


యునానీది వందల ఏళ్ల చరిత్ర. తొలుత దీనికి బీజం పడింది గ్రీస్‌లో.   మధ్య ఆసియా ప్రాంతాన్ని మంగోల్స్ ఆక్రమించుకునే సందర్భంలో ఇది  మనదేశంలోకి ప్రవేశించింది. అప్పటి ఢిల్లీ సుల్తాన్‌లు, ఖిల్జీలు ఈ వైద్య విధానాన్ని ఆదరించి ప్రాచుర్యం కల్పించారు.  విస్తరణకు తమవంతుగా చేయూతనందించారు. ఆ తర్వాత మొఘల్  సామ్రాజ్యం హయాం రావటంతో దీనికి స్వర్ణయగం వచ్చింది. వివిధ ప్రాంతాలపై దండెత్తుతూ వెళ్లిన మొఘల్స్ పరోక్షంగా యునానీని ఉపఖండవుంతా విస్తరించారు. కుతుబ్‌షాహీల కాలంలో దక్కన్ పీఠభూమి ఈ వైద్యానికి కేంద్రంగా మారింది.  

 

అప్పట్లో హైదరాబాద్ హకీంలకు దేశవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. హకీం అమ్జల్‌ఖాన్ 1880 ప్రాంతంలో యునానీలో కొత్త పరిశోధనలకు తెరతీశారు. శాస్త్రీయంగా దాని ఔన్నత్యాన్ని చాటారు. ఈ పరిస్థితులూ క్రమంగా మసకబారిపోయాయి. ఆంగ్లేయుుల కాలంలో దీని ప్రాభవం తగ్గినా..  నిజాంలు తిరిగి   ప్రాణ ప్రతిష్ట చేశారు. ఢిల్లీ, లక్నో, హైదరాబాద్‌లలో మళ్లీ క్రమంగా పుంజుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి చక్కటి సహకారమూ అందింది. పుట్టింది గ్రీస్‌లో అయినా సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచానికి అద్భుత ఔషధాలను అందించిన ఘనత మనకే దక్కింది. ఇరాన్, ఇరాక్, పాకిస్థాన్, ఈజిప్టు, సిరియా, చైనా... తదితర దేశాల్లో మన ఆవిష్కరణలకు మంచి ఆదరణ కొనసాగుతోంది. అందుకే మన సంస్కృతిలో యునానీ భాగమైంది.

 

 గౌరీభట్ల నరసింహమూర్తి

 ఫొటోలు : శ్రీనివాస్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top