‘హోదా’పై తీర్మానం

‘హోదా’పై తీర్మానం - Sakshi

  •  ఏపీ అసెంబ్లీలో పట్టుబట్టనున్న వైఎస్సార్‌సీపీ.. నేటి నుంచి సమావేశాలు

  •  తీర్మానం బలపడాలంటే కేంద్రంలో టీడీపీ మంత్రులు తప్పుకోవాలి

  •  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనా నిలదీతకు విపక్షం సిద్ధం

  •  అనేక సమస్యలున్నా ఐదు రోజులకే పరిమితం చేసిన ప్రభుత్వం

  •  కనీసం 15 రోజులైనా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

  •  నేటి ఉదయం.. 9.30కి అసెంబ్లీ.. 10 గం.లకు మండలి

  •  సాక్షి, హైదరాబాద్

     రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనపై అసెంబ్లీ సమావేశాల్లో తొలి అంశంగా ప్రత్యేక చర్చ చేపట్టడమేగాక, దానిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ గట్టిగా పట్టుబట్టనుంది. ఈమేరకు వాయిదా తీర్మానం ప్రతిపాదించనుంది. హోదా విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, తీర్మానానికి బలం చేకూరేలా కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ తన మంత్రులను ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేయనుంది. ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్‌సీపీ రాజీలేని ధోరణిని అవలంబిస్తుండటంతో నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతుండగా, ఈ సమావేశాలను కేవలం అయిదు రోజులకే పరిమితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలన్నిటినీ చర్చించడానికి కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని వైఎస్సార్‌సీపీ గట్టిగా కోరుతోంది.

     

     తొలిరోజు సమావేశాలు ప్రారంభానికి ముందుగానే స్పీకర్ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి(బీఏసీ) సమావేశమై ఎజెండాను ఖరారు చేయనుంది. మరోవైపు ప్రస్తుత సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై తీర్మానం చేయడంతో పాటు గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 30 మంది మృత్యువాత, ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి, రాజధాని పేరుతో భూసేకరణ, నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య, కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు, రుణభారంతో రైతుల ఆత్మహత్యలు, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు, పట్టిసీమ, అనేక అంశాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షం సన్నద్ధమైంది.

     

     పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ఈ నెల 29న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నిర్వహించిన రాష్ట్రబంద్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రస్తుత సమావేశాల్లో తొలిఅంశంగా ప్రత్యేకహోదాను చేర్చాలని పట్టుబడుతున్న వైఎస్సార్‌సీపీ దానిపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తొలిరోజునే వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రత్యేకహోదా ఇవ్వాలని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ఏడాదిన్నర కిందటే తీర్మానించినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయకపోవడానికి అధికార టీడీపీ కేంద్రంతో రాజీధోరణితో వెళ్లడమే కారణమని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఇందుకు కేంద్ర మంత్రివర్గంలోని తన మంత్రులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ అంశంపైనే తొలిరోజు చర్చకు పట్టుబట్టాలని ఆదివారం వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం నిర్ణయించింది.

     

     పక్షం రోజులైనా జరపాలి

     శాసనసభ గత బడ్జెట్ సమావేశాల పనిరోజులను బాగా కుదించిన అధికార టీడీపీ ఈసారి వర్షాకాల సమావేశాలనూ కేవలం అయిదు రోజులకే పరిమితం చేయాలని నిర్ణయించింది. కీలకమైన అనేక అంశాలపై చర్చించాల్సి ఉన్నందున ఈ సమావేశాలను కనీసం పక్షం రోజులైనా జరపాలని సభలో ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ పట్టుబట్టబోతోంది. రుణభారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటమే కాకుండా రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్వల్పకాలిక సమావేశాల వల్ల ప్రయోజనం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనేక వైఫల్యాలు, అనేక అంశాలు, సమస్యలున్నందునే ఈసారి సమావేశాలను కేవలం అయిదు రోజులకే పరిమితం చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు అధికార పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం.

     

     ప్రభుత్వానిది ఇరకాట పరిస్థితే

     ఈసారి సమావేశాల్లో ప్రతిపక్షం లేవనెత్తబోయే అంశాలన్నీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ఉన్నాయి. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై ఎలా వ్యవహరించాలన్న దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని, ఇరకాటంలో పెట్టే అంశాన్ని లేవనెత్తిన ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగత దాడి చేయడం ద్వారా పక్కదారి పట్టించే వ్యూహంతో వెళ్లాలని చెప్పారు. ఇదే అంశాన్ని సోమవారం మధ్యాహ్నం జరిగే టీడీఎల్పీ సమావేశంలో మరోసారి చంద్రబాబు స్పష్టం చేయనున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగొద్దని సూచిస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈసారి సమావేశాల్లో వాటిని ఎలా నియంత్రిస్తారన్నది చూడాల్సి ఉంది.

     

     అబ్దుల్ కలామ్ మృతికి సంతాపం

     సోమవారం ఉదయం సభ 9.30గంటలకు సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళులు అర్పిస్తుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతుంది. తొలిరోజు సభ లో దేవాదాయ మంత్రి ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్(సవరణ) ఆర్డినెన్స్-2015, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఏపీ ఫార్మర్స్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఆర్డినెన్స్-2015ను సభలో ప్రవేశపెడతారు. శాసనమండలి ఉదయం 10గంటలకు సమావేశమౌతుంది. తొలుత మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళులు అర్పిస్తుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడతారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top