నీవైపు రావడానికి ఏంటి నీ గొప్ప?

నీవైపు రావడానికి ఏంటి నీ గొప్ప? - Sakshi


చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా

మేమంతా జగన్ వెంటే ఉంటాం..


 

 సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చినరోజు నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని తమ వైపునకు లాక్కోవడానికి చంద్రబాబు నయానోభయానో బెదిరిస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కరూ అటువైపు వెళ్లలేదంటే ఆయనేంటో, ఆయన నాయకత్వమేంటో తెలుసుకోవాలని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని విన్నాం. అలాగే పచ్చపార్టీకి చెందిన సీఎం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా తమ పార్టీలోకి వచ్చేసినట్టు భ్రమపడుతున్నారు.



ఆ భ్రమను ప్రజలకూ కలిగించాలన్న ప్రయత్నాన్ని నిన్న చానల్స్‌లో చూశాం.  కానీ ఒక్కరూ కలవలేదంటే ఒక్కసారి ఆయన గురించి ఆయనే ఆలోచించుకోవాల్సిన అవసరముంది’ అని అన్నారు. అయినా తమ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపునకు వెళ్లడానికి ఆయన గొప్పేంటని ఆమె ప్రశ్నించారు.   అవి నీతి, వంచనకు, వెన్నుపోటుకు, విశ్వాసఘాతుకానికీ కేరాఫ్ అడ్రస్సైన చంద్రబాబు వద్దకు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వెళ్లరన్నారు. జగన్ వెంట ఉన్నవారందరమూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవారం కాదని రోజా గుర్తుచేశారు. ప్రజలు అధికారమిచ్చినప్పుడు రాజన్నరాజ్యం తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్న జగన్‌వెంటే తాముంటామన్నారు. రాజశేఖరరెడ్డి, జగన్, వారి కుటుంబసభ్యులకోసం ప్రాణాలిచ్చేవారు లక్షలమంది ఉన్నారని.. చంద్రబాబుకోసం ప్రాణాలు తీసుకునే ఆయన అనుచరుల పేర్లు ఇద్దరివి చెప్పగలరా? అని ప్రశ్నించారు.



 కమిటీ తీరుపై స్పీకర్‌కు లేఖ రాస్తా

 తన సస్పెన్షన్ తదనంతర పరిమాణాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సమావేశాలు జరుగుతున్న తీరుపై స్పీకర్‌కు లేఖ రాయబోతున్నట్టు రోజా పేర్కొన్నారు. తాననని వాటిని, అన్నట్టుగా సృష్టించి, సోషల్‌మీడియాకు విడుదల చేశారన్నారు. అవి ఎడిట్ అయినట్టు.. నాలుగైదురకాల చీరెల్లో తాను మారిమారి ఉన్నట్టు వీడియోలో తెలుస్తుందన్నారు. జీరోఅవర్‌లో ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన ఒక లీకేజీపై చర్చ జరిపి అదేదో తాను తప్పు చేసినట్టు ఫిక్స్‌అయిపోయి, తనకు ఇంకేదో శిక్ష వేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పీకర్‌కు లేఖ ఇవ్వడంతోపాటు సైబర్‌క్రైం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేయబోతున్నానని చెప్పారు. అసెంబ్లీలో తనపై ఎవరు వీడియో చిత్రీకరణ చేశారన్న దానిపై అసెంబ్లీ కార్యదర్శి వివరణ కోరితే.. ఆయన్నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందన్నారు. అసెంబ్లీ కార్యదర్శిపై చార్జిషీటున్నా విధుల్లో కొనసాగడంపై త్వరలో గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top