మహిళలపై అరాచకాలకు అడ్డా ఏపీ

మహిళలపై అరాచకాలకు అడ్డా ఏపీ - Sakshi

  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజం

  • బృందా కారత్, మేధా పాట్కర్‌ను ఎందుకు ఆహ్వానించలేదు?

  • సాక్షి, హైదరాబాద్‌: మహిళలను అణచివేయడంలో, వారిపై అరాచకాలు సాగించడంలో ఆంధ్రప్రదేశ్‌ను అడ్డాగా మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు‘జాతీయ మహిళా పార్లమెంట్‌’ సదస్సుకు హాజరయ్యే అర్హతే లేదని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళ లపై దౌర్జన్యాలకు పాల్పడిన పచ్చ(టీడీపీ) నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మహిళా పార్లమెంట్‌ డిక్లరేషన్‌ చేస్తుందా? అని ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం జరిగే డిక్లరేషన్‌కు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతునిస్తుందని స్పష్టం చేశారు.



    మహిళలకు క్షమాపణ చెప్పాలి

    ‘‘రాష్ట్రంలో గతేడాది మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయని డీజీపీ సాంబశివరావు స్వయంగా ప్రకటించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు బోడే ప్రసాద్, బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు లాంటి వారిని చంద్రబాబు వెనకేసుకొస్తున్నారు. బాధిత మహిళల తరపున ప్రశ్నిస్తే నిబంధనలకు విరుద్ధంగా నన్ను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారు. అత్త అనే గౌరవం లేకుండా  లక్ష్మీపార్వ తి వ్యక్తిత్వాన్ని చంద్రబాబు కించపరిచారు. మహిళల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బృందా కారత్, మేధా పాట్కర్‌ వంటి వారిని మహిళా పార్లమెంట్‌కు ఎందుకు ఆహ్వానించలేదు? ఏపీని మహిళలపై దాడులకు అడ్డాగా మార్చేసిన బాబు మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఆ తరువాతే సదస్సుకు హాజరు కావాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top