సత్రం భూముల వేలాన్ని రద్దు చేయాలి

సత్రం భూముల వేలాన్ని రద్దు చేయాలి - Sakshi


- సదావర్తి సత్రం భూముల వేలంపై సమగ్ర దర్యాప్తు చేయాలి

- డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు

- దేవుడు కూడా చంద్రబాబును క్షమించడు: బొత్స మండిపాటు

 

 సాక్షి, హైదరాబాద్: వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉన్న అమరావతి శ్రీసదావర్తిసత్రం భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని, ఈ వ్యవహారంపై సమగ్రవిచారణకు ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సీని యర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అత్యంత ఖరీదైన ఈ భూ ములను కారుచౌకగా లోకేశ్‌కు బినామీ అయిన కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుమారుడికి కట్టబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మా న ప్రసాదరావు, ఎమ్మెల్యే గడికోట శ్రీ కాంత్‌రెడ్డితో కలిసి బొత్స విలేకరులతో మాట్లాడారు. చెన్నై సమీపంలోని తాలంబూరులోని అత్యంత విలువైన ఆ భూములను కారుచౌకగా ధారాదత్తం చేశారని మండిపడ్డారు.



 ఆఘమేఘాలపై కథ నడిపించారు..

 టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సత్రం భూములు అమ్మేయాలని సీఎం కార్యాలయానికి లేఖ రాయడంతోనే కథమొదలైందని, ఆఘమేఘాలపై స్పందించిన అధికారులు ఈ భూములు అమ్మేయాల్సిందిగా ఆదేశాలిచ్చారన్నారు. అక్కడ ఒక ఎకరా ఖరీదు రూ. 6 కోట్లుగా ఉందని దేవాదాయశాఖ అధికారులు చెప్పినా.. వాస్తవానికి  ఎకరా రూ. 13 కోట్లకు పైనే ఉందన్నారు. చలమలశెట్టి బృందానికి ఎకరా భూమిని కేవలం రూ. 27 లక్షలకే ఇచ్చేశారని మండిపడ్డారు. దేవుడి భూములను దోచుకుంటున్నందుకు ఆయన చంద్రబాబును క్షమించడని అన్నారు.  చిత్తశుద్ధే ఉంటే సత్రం భూములను పారదర్శకంగా వేలం నిర్వహించాలని బొత్స డిమాండ్ చేశారు.



 ఇంకా జగన్‌పై ఆరోపణలా..

 పరిటాల రవి హత్యకు సంబంధించి ఇంకా జగన్‌పై ఆరోపణలు చేయడం అసంబద్ధమని  అన్నారు. సీబీఐ విచారణచేస్తే ఆ హత్యకు జగన్‌కు ఏ సంబంధమూ లేదని తేలిందన్నారు. ఇప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కూడా గతంలో సీబీఐ విచారణ జరిగితే ఏమీ నిర్థారణ కాలేదని, మరి దాన్ని కూడా తప్పుపడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే వంగవీటి రంగా హత్య జరిగిందని ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన చేగొండి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాసిన అంశాన్ని బొత్స ఉటంకిస్తూ... దానిపై బాబు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

 

 బాబు మనవడు ఏడ్చినా జగనే కారణమా...

 చంద్రబాబు రామజపంలాగా రోజూ జగన్ జపం చేస్తున్నారని బొత్స అన్నారు. మొన్న ఒక స్వామీజీ బ్రాహ్మణ సమస్యలపై మాట్లాడితే ఆయన వెనుక జగన్ ఉన్నారని నిందించారని... చూడబోతే చంద్రబాబు అందాన్ని చూసి ఆయన మనవడు జడుసుకుని ఏడ్చినా దాని వెనుక జగన్ ఉన్నాడని విమర్శించేలాగున్నారని బొత్స ఎద్దేవా చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top