ప్రత్యేక పోరులో అగ్రభాగాన వైఎస్సార్‌సీపీ

ప్రత్యేక పోరులో అగ్రభాగాన వైఎస్సార్‌సీపీ - Sakshi


* ఢిల్లీనుంచి గల్లీ వరకూ నిరంతర పోరు

* ప్రధాని, రాష్ట్రపతి కేంద్రమంత్రులకు జగన్ విజ్ఞప్తులు

* హోదాకోసం జగన్ ఆమరణ దీక్ష, యువభేరి సదస్సులు

* ప్రత్యేకహోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం

* మే 10న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నాలు


సాక్షి, హైదరాబాద్: విభజనతో అన్ని విధాలా దారుణంగా నష్టపోయిన ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కల్పించడం ఒక్కటే పరిష్కారమని తొలి నుంచీ నమ్ముతూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన నిలిచింది.



సాధారణ ఎన్నికలు ముగియగానే ప్రధాని పదవి చేపట్టడానికి ముందే నరేంద్రమోదీని కలిసింది మొదలు నేటి వరకూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా కోసం నిరంతరం నినదిస్తూనే ఉన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేయడం మొదలుకొని ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక హోదా కావాలని వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు జాతీయ స్థాయిలో ఆ ప్రాధాన్యతను ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు.



ప్రత్యేక హోదా రాదేమోనన్న ఆందోళనతో తిరుపతితో మునికోటి ఆత్మార్పణం చేసుకోవడం యావత్ రాష్ట్రాన్ని కుదిపివేసింది. మరో ముగ్గురు కూడా ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దశలో జగన్ వారి కుటుంబాలను పరామర్శించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తానే స్వయంగా నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. దీక్ష భగ్నం తరువాత కూడా జగన్ యువభేరీలను నిర్వహిస్తూ ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతను చాటి చెబుతూ వచ్చారు.



చివరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా బుధవారం చేసిన ప్రకటనలో తేల్చి చెప్పడంతో ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపు నిచ్చింది.   

 

హోదాకోసం వైఎస్సార్‌సీపీ...

2014, మే 19: ప్రధానిగా పదవి చేపట్టడానికి ముందే నరేంద్రమోడీని తమ పార్టీ ఎంపీలతో పాటుగా ఢిల్లీలో కలిసి ప్రత్యేక హోదా కావాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

2015 మార్చి: ఎంపీలతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని గుర్తు చేసిన జగన్.

మే: ప్రత్యేక హోదా కావాలని కోరుతూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపిన పార్టీ ఎంపీలు.

జూన్ 3, 4: మంగళగిరిలో జగన్ చేసిన రెండు రోజుల సమర దీక్షలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా డిమాండ్ చేశారు.

జూన్ 9: ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ప్రత్యేకహోదా అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.

ఆగస్టు 10: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేసి రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షను జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. అదే రోజు మార్చ్ టు పార్లమెంట్‌ను నిర్వహించి ఢిల్లీ వీధుల్లో అరెస్టయ్యారు.

ఆగస్టు 29: ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు.

సెప్టెంబర్ 15: తిరుపతిలో జగన్ యూనివర్శిటీ విద్యార్థులు, యువకులతో యువభేరి సదస్సులను నిర్వహించి ప్రత్యేక హోదాపై వారిని జాగృతం చేశారు.

సెప్టెంబర్ 22: విశాఖపట్టణంలో యువభేరి సదస్సు నిర్వహణ.

అక్టోబర్ 7: ప్రత్యేకహోదా కోసం జగన్ నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభం.

అక్టోబర్ 14: ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో జగన్ దీక్షను భగ్నం చేసిన ప్రభుత్వం.

2016 జనవరి 27: ప్రత్యేకహోదాకోస ఆవశ్యకతను వివరిస్తూ కాకినాడలో యువభేరి.

ఫిబ్రవరి 2: శ్రీకాకుళంలోనూ విద్యార్థులు, యువకులను సమీకరించి యువభేరీ సదస్సు నిర్వహణ.

ఫిబ్రవరి 23, 24: ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రిని కలిసి ప్రత్యేక హోదా ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసిన జగన్.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top