హోదాపై మోసం చేస్తున్నాయి

హోదాపై మోసం చేస్తున్నాయి - Sakshi


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్సార్‌ సీపీ నేతల ధ్వజం



సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కోన రఘుపతి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మతో కలసి మీడియాతో మాట్లాడారు. అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని బకాయీలతో సహా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను వారు ఈ సమావేశంలో విడుదల చేశారు.



ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేశారని, ప్రత్యేక ప్యాకేజీ అంశం కూడా కనిపించడం లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం లేకుంటే నెలకు రూ.2,000 భృతి చెల్లిస్తామని సాక్షాత్తూ చంద్రబాబు సంతకంతో ఇంటింటికీ పంచిన కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. వాస్తవానికి కేంద్ర మంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏవీ లేవన్నారు. కేంద్ర మంత్రివర్గం ముందు టేబుల్‌ ఎజెండాగా ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించే నోట్‌ వచ్చినట్లు, దానిని ప్రధాని నరేంద్ర మోదీ ‘పక్కన పెట్టండి... తరువాత చూద్దాం’ అన్నట్లు చెప్పుకుంటున్నారని అంబటి విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఎన్నికలపుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, అలాగే కేంద్రం విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుకూ సీఎం పట్టుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏమీ లేదని గుర్రం ముందు పచ్చగడ్డి చూపించి అందకుండా దానిని పరుగెత్తించినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top