ప్రజలను అవమానించడమే

ప్రజలను అవమానించడమే - Sakshi


ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకపోవడం

సత్వరమే వారిని అనర్హులను చేయాలని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల డిమాండ్‌



సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయడంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఇంకా జాప్యం చేస్తే.. అది ప్రజలను అవమానించడమే అవుతుందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వర్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీలోకి తమ పార్టీ నుంచి దొంగిలించిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశించరాదని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌కు రాసిన లేఖను వారు సోమవారం విడుదల చేశారు.



ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు కెమెరాల సాక్షిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారని, అయినా స్పీకర్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. వారి అనర్హత కోసం తాము పదే పదే డిమాండ్‌ చేసి కోర్టుకు వెళ్లే పరిస్థితులు తెచ్చారన్నారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ ఉన్నపుడు ప్రతిపక్షాన్ని ప్రజా సమస్యలపై మాట్లాడనీయకుండా గొంతును నొక్కేసే వారన్నారు. సమస్యలపై గళమెత్తినపుడల్లా ప్రతిపక్షాన్ని అవమానించడం, సస్పెండ్‌ చేయడమే అధికారపక్షం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.



ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు అక్రమంగా సస్పెండ్‌ చేయడమే అందుకు ఉదాహరణ అని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని వారు కోరారు. పార్టీలు మారి తలవంపులు తెచ్చిన ఎమ్మెల్యేలను కొత్త అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి ముందే అనర్హులుగా ప్రకటిస్తే స్పీకర్‌ చరిత్రలో నిలిచి పోతారన్నారు. వారిపై చర్యలు తీసుకున్నాక అడుగు పెడితే శాసనసభ గౌరవం కూడా ఇనుమడిస్తుందని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఎమ్మెల్యేలపై ఏదో రకంగా కుట్ర చేసి అసెంబ్లీలోకి రాకుండా చేయాలని అధికారపక్షం చూస్తోందని, ఇది మంచిది కాదని వారు హితవు పలికారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top