5న కడపలో ఇఫ్తార్ విందుకు వైఎస్ జగన్

5న కడపలో ఇఫ్తార్ విందుకు వైఎస్ జగన్ - Sakshi


సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన కడపలో జరిగే ఇఫ్తార్ విందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా నేతృత్వంలో  కువైట్ ప్రతినిధుల బృందం గురువారం జగన్‌ను ఆయన నివాసంలో కలసి ఈ విందుకు ఆహ్వానించింది. వైఎస్సార్ కాంగ్రెస్ గల్ఫ్ కన్వీనర్ బి.హెచ్ ఇలియాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేడపాటి వెంకట్,  కువైట్ కమిటీ సభ్యులు దుగ్గి గంగాధర్, సుబ్రమణ్యం రెడ్డి, ఎన్నారై షేక్ నాసర్, జి.ఎస్.బాబు రాయుడు, ఎస్. మున్నా, అజ్మత్, జఫరుల్లా ఈ బృందంలో ఉన్నారు.



 పాల్మన్‌పేట ఘటనపై వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు

 విశాఖపట్నం జిల్లా పాల్మన్‌పేట లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి తమ్ముడి మనుషులు మంగళవారం సాగించిన అరాచకం, దుర్మార్గమైన దాడులకు సంబంధించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీలో సభ్యులుగా మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, చెంగల వెంకటరావు, గొల్ల బాబూరావు, కోలా గురువులు ఉన్నారని పార్టీ కే ంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.



ఈ కమిటీ పాల్మన్‌పేటలో జూలై 1, 2 తేదీల్లో పర్యటిస్తుందని తెలిపింది. పాల్మన్‌పేటలో జరుగుతున్న దాడులను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొంది. మంగళవారం నాడైతే మంత్రి యనమల తమ్ముడి మనుషులు పాల్మన్‌పేట గ్రామాన్ని లూటీ చేసి, మహిళలు, పిల్లలపైన, ఇంకా పలువురిపై భౌతికంగా దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో భయకంపితులై ఉన్న అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వడానికి నిజనిర్ధారణ కమిటీని వైఎస్ జగన్ అక్కడికి పంపుతున్నారని వివరించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top