డిఫెన్స్‌లో పడిన చంద్రబాబు!

డిఫెన్స్‌లో పడిన చంద్రబాబు!


హైదరాబాద్:

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరగబోతోందని, ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆందోళన బాట పట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంగుతిన్నారు. నీటి కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా ఆంధ్రప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని, ఆ ప్రాంత ప్రజల సాగునీటి, తాగునీటి సమస్య తీవ్రమవుతుందని జగన్ ఆందోళన బాట పట్టారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆయన మాచర్లలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.



ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన నీటి సమస్యపై జగన్ పోరాటబాట పట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఓటుకు నోటు కేసు బయటపడిన తర్వాత కాలం నుంచి చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య కీలకమైన జల వివాదం విషయంలో చంద్రబాబు నోరెత్తకపోవడంలోని ఆంతర్యమేంటని మాచర్లలో ధర్నాలో జగన్ ప్రశ్నించారు.



దాంతో డిఫెన్స్ లో పడిన చంద్రబాబు సోమవారం నాటి మంత్రిమండలి సమావేశంలో ఈ అంశం ఎజెండాలో లేకపోయినప్పటికీ.. దానిపైనే చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన జగన్ చేపట్టిన ఆందోళన వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని గ్రహించి ఆ ప్రమాదం నుంచి బయటపడటం ఎలా అన్న అంశంపై ఆయన తర్జన భర్జన పడినట్టు తెలిసింది. కేబినెట్ లో ఈ అంశంపై చర్చించి తాము ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నామని చెప్పడానికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోదంతోనే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని, అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కృష్ణా గోదావరి ఎపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరారు.



తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్రాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దాన్ని అడ్డుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అయినా చంద్రబాబు మాత్రం కేసీఆర్ పై ఒక్కమాట మాట్లాడలేదు. కేబినేట్ సమావేశం అనంతరం సాయంత్రం చంద్రబాబు స్వయంగా మీడియాతో మాట్లాడినప్పటికీ ఈ విషయంలో సూటిగా చెప్పకుండా తమ అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్ర మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు మాత్రం చెప్పారు.



తెలంగాణ చేపడుతున్న ఆ ప్రాజెక్టు వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసినా కేసీఆర్ పై చంద్రబాబు గట్టిగా మాట్లాడకపోవడమేంటని కేబినెట్ కు హాజరైన పలువురు మంత్రులు పెదవి విరిచారు. చంద్రబాబుకు ఉన్న ఇబ్బందుల కారణంగానే గట్టిగా నోరెత్తలేకపోతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top