వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే

వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే - Sakshi


- పంచాంగ కర్త బ్రహ్మశ్రీ రామచంద్రశాస్త్రి జోస్యం

- వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు....

- హాజరైన వైఎస్‌ జగన్, పార్టీ నేతలు




సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో  వార్‌ వన్‌సైడ్‌గా ఉంటుందని పంచాంగ శ్రవణకర్త సిద్ధాంతి బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి  చెప్పారు. బుధవారం లోటస్‌పాండ్‌ లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ‘శ్రీ హేవళంబి నామ ఉగాది వేడుకలు’ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  సిద్ధాంతి బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి ఉగాది పంచాంగం వినిపించారు. వైఎస్‌ జగన్‌ జాతకం అద్భుతం గా ఉందని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో భారీ మెజారిటీతో గెలుపొందుతారని చెప్పారు. ఏపీలో వచ్చేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఘంటాపథంగా చెప్పారు. త్వరలో ప్రత్యేక హోదా కూడా  వచ్చే అవకాశం ఉన్నట్లు గ్రహాలు సూచిస్తున్నా యన్నారు.



ఆ ఘనత అంతా జగన్‌కే దక్కుతుందన్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై వైఎస్‌ జగన్‌పై పెట్టిన కేసులు నిలబడవన్నారు. అన్ని కేసుల నుంచి జగన్‌ కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను ప్రజలు అన్ని విధాలుగా కష్టపడి గెలిపించుకొంటారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తనతో కలిసి వచ్చే  పార్టీలను, మిత్రులను కలుపుకొని వెళ్లాలని సూచించారు. ఏ మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని పేర్కొన్నారు.



కాలం అందించిన వజ్రం వైఎస్సార్‌...

వైఎస్సార్‌ మహానేత.  కాలం అందించిన వజ్రం అని సిద్ధాంతి రామచంద్రశాస్త్రి కొనియాడారు. స్వతహాగా డాక్టర్‌ కావడం వల్ల ఆయన ప్రజల నాడి తెలుసుకొని  సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని  చెప్పారు. ప్రజలకు ఎంతో చేరువయ్యారని, మహానేతగా వారి మనస్సుల్లో సుస్థిరంగా నిలిచారని చెప్పారు. తండ్రి బాటలోనే  నడుస్తున్న తనయుడు వైఎస్‌ జగన్‌ అనతి కాలంలోనే  ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారని చెప్పారు. ఒక శాతం ఓట్లతో అధికారానికి దూరమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఈ మూడేళ్లలో బాగా పుంజుకొందని, గ్రహాలు సైతం ఎంతో అనుకూలంగా ఉన్నాయని అన్నారు.



ప్రజల్లో ఆందోళన...

ప్రస్తుత పాలకుల విధానాల వల్ల  ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఎక్కడికక్కడ ధర్నాలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజధాని అమరావతిపై  భ్రమలు తొలగాయని, ఇప్పుడు అది భ్రమరావతిగా మారిందని అన్నారు. ప్రత్యేక హోదాను విస్మరించే పార్టీలను ప్రజలు 10 కి.మీ లోతులో పాతరేసే సూచనలు ఉన్నట్లు గ్రహాలు చెబుతున్నాయన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ భవిష్యత్తు మూడుపువ్వులు, ఆరుకాయల్లా ఉంటుందని చెప్పారు. కులాలవారీగా, మతాల వారీగా ఓట్లు చీలకుండా చూస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెలుపు తథ్యమన్నారు.



నిత్యం ప్రజల్లో ఉంటున్న వైఎస్‌ జగన్‌ ఒక స్టార్‌గా వెలగనున్నారని, ఆయనకు రాజయోగం ఉందని జోస్యం చెప్పారు. రాష్ట్రపతిగా అద్వానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు డా.గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, ఏపీ ముఖ్యనాయకులు బాలశౌరి, పుత్తా ప్రతాప్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, సినీ నటుడు విజయచందర్, నందమూరి లక్ష్మీపార్వతి, ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి... పలు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులందరినీ జగన్‌మోహన్‌రెడ్డి పేరుపేరున పలకరించారు.  అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top