మా పార్టీ పేరులోనే శ్రామికులున్నారు

మా పార్టీ పేరులోనే శ్రామికులున్నారు - Sakshi


♦ ఎప్పుడూ శ్రామికుల పక్షానే నిలబడతాం

♦ మేడే వేడుకల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

♦ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపిన విపక్షనేత

♦ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా కార్మిక దినోత్సవం

 

 సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ పేరులోనే శ్రామికులున్నారని, ఎల్లప్పుడూ తాము శ్రామికులకు అండగా, వారి పక్షానే నిలబడతామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌టీయూసీ (పార్టీ కార్మిక విభాగం) పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మేడే సందేశమిస్తూ తమ పార్టీ అయిన ‘ైవె ...ఎస్...ఆర్’ కాంగ్రెస్‌లో ‘వై’ అంటే యువజనులు, ‘ఎస్’ అంటే శ్రామికులు, ‘ఆర్’ అంటే రైతులు అని, ఈ మూడు వర్గాల తరపున వారి సంక్షేమం కోసం పోరాడే పార్టీ అని వేరే చెప్పక్కర లేదని వివరించారు. శ్రామికులకు ఎక్కడ సమస్యలు వచ్చినా వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉండి అం డదండలు అందిస్తుందని మేడే రోజు చెబుతున్నానని జగన్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్మికులందరికీ ఆయన మేడే శుభాకాంక్షలు తెలియ జే స్తూ.. శ్రామికుల సంక్షేమానికి అందరూ ఒక్కటై పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.



 బ్రాండిక్స్‌పై బాబు తీరు గర్హనీయం

 విశాఖపట్నంలో బ్రాండిక్స్ కార్మికులపై విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఏపీలో జరుగుతున్న కొన్ని బాధాకరమైన సంఘటనల మధ్య ఇవాళ మేడే జరుపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం జిల్లాలో ఉండగానే తమ జీతాలు పెంచండి అని దాదాపుగా 20 వేలమంది బ్రాండిక్స్ కార్మికులు అడుగుతుంటే వారిపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించారన్నారు. కార్మికుల్లో ఆడవారిని సైతం వదలకుండా విచక్షణా రహితంగా కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రే దగ్గరుండి పోలీసుల చేత వారిని కొట్టించే పరిస్థితి ఉంటే ఈ పాలకులు శ్రామికులకు మేలు చేద్దామనే ఆలోచన చేస్తారా? అనేది అనుమానంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సాక్షిగా బ్రాండిక్స్ కార్మికులపై దాడి జరుగుతూ ఉంటే ఆ శ్రామికులు ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? న్యాయం కోసం ఎటువైపు తిరగాలి? అని జగన్ ప్రశ్నించారు. బ్రాండిక్స్ దగ్గరి నుంచి శ్రామికులకు ఎక్కడ సమస్యలు వచ్చినా వైఎస్సార్‌సీపీ ముందుంటుందన్నారు.



 శ్రామికుల రాజ్యం కోసం పోరాడాలి

 రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రామికులు తలెత్తుకుని ఇది మా రాజ్యం...అని చెప్పుకునే రోజుకోసం పోరాడుదామని, అందరూ కలిసి కట్టుగా ముందుకు రావాలని ఆయన సూచించారు.పోరాట స్ఫూర్తితో జరుపుకునే కార్మికుల దినోత్సవం నాడు అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానన్నారు. వైఎస్సార్‌టీయూసీ ఏపీ విభాగం అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మేడే ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎస్.బిక్షపతి, పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, నేతలు వాసిరెడ్డి పద్మ, హెచ్.ఏ.రెహ్మాన్, వీఎల్‌ఎన్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top