సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి


 కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌పై రాష్ట్రపతికి వైఎస్ జగన్ వినతి

 రోజాపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాల్సిందిగా

 స్పీకర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి

 రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వివరించిన ప్రతిపక్ష నేత

 సీఎం చంద్రబాబు అండతో టీడీపీ నేతలు ఇసుక, మద్యం,

 రియల్ ఎస్టేట్ మాఫియాలను నడిపిస్తున్నారు

 విజయవాడ కాల్‌మనీ ముఠా.. మంత్రులకు,

 అధికార పార్టీ నేతలకు నిధులు సమకూరుస్తోంది

 సెక్స్ రాకెట్ నిందితులు ముఖ్యమంత్రితో, ఇంటెలిజెన్స్ అదనపు డీజీతో కలసి దిగిన ఫోటోలున్నాయి

అయినా ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమేయం లేదని డీజీపీ చెబుతున్నారు

 ఇవన్నీ చూస్తే ఈ వ్యవహారం చంద్రబాబుకు తెలిసే జరుగుతోందని రుజువవుతోంది

 ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలసి ప్రణబ్‌ను కలసిన విపక్ష నేత

 గిరిజన సలహా మండలి ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతి

 ఏపీకి హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సూచించాలని కోరిన జగన్


 

సాక్షి, హైదరాబాద్: విజయవాడలో బలవంతపు పడుపు వృత్తి రూపంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన (కాల్‌మనీ సెక్స్ రాకెట్)పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీని కోరారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాల్సిందిగా ఏపీ శాసనసభ స్పీకర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలసి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతితో భేటీ అయ్యారు. కాల్‌మనీ, రోజా సస్పెన్షన్‌పై ఒక వినతిపత్రం సమర్పించడంతో పాటు గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రానికి సూచించాలని కోరుతూ వినతిపత్రాలను అందజేశారు. అరగంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను జగన్ వివరించారు.

 

 ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ చూసుకుని టీడీపీ శ్రేణులు రాష్ట్రంలో అసాధారణమైన రీతిలో చెలరేగిపోతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలను సైతం తప్పుడు కేసుల్లో ఇరికించడమే కాక తమ ఆగడాలకు అడ్డొచ్చే వారిని విచ్చలవిడిగా ఇబ్బందులు పెడుతున్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకొచ్చిన తొలినాళ్లలో జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన ఏం మాట్లాడారో మీ దృష్టికి తెస్తున్నాను. (టైమ్స్ గ్రూప్-ఈ పేపర్‌లో ఆగస్టు 8, 2014వ తేదీన ఇందుకు సంబంధించి ప్రచురితమైన వార్తను జగన్.. ప్రణబ్‌కు అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచారు. ‘మళ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించే విధంగా టీడీపీ కార్యకర్తలను అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ భాగస్వాములను చేయాలని గురువారం జిల్లా కలెక్టర్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడం పెద్ద దుమారాన్ని సృష్టిస్తున్నది. మీరు నిబంధనల ప్రకారం నడుచుకోవాలనుకుంటే అది మీకు బాగానే ఉంటుంది. మమ్మల్ని మాత్రం ఈ విధానం ఇంటికి పంపిస్తుందని ఆయన చెప్పడం కలెక్టర్లకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.

 

 మేం అధికారం పోగొట్టుకున్నప్పుడు మీరెవ్వరూ మా చుట్టూ మిగలరు. మా కార్యకర్తలు మాత్రమే మా వెంట ఉంటారు’ అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని టైమ్స్ గ్రూప్ తన ఈ-పేపర్‌లో ప్రచురించింది) చంద్రబాబు ఇలా మాట్లాడిన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెగబడి ఇసుక, మద్యం, రియల్ ఎస్టేట్ మాఫియాలను నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి అతి హేయమైన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ మాఫియా కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీలకు రుణాలు ఇస్తూ.. బాధిత మహిళలు రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో వారిని లైంగికంగా లోబర్చుకోవడంతో పాటు అనేక దుర్మార్గమైన పనులకు పాల్పడుతున్నారు.

 

 బాబు సీఎం అయ్యాక బెజవాడ నేరాలకు రాజధాని అయింది

 చంద్రబాబు సీఎం అయ్యాక విజయవాడ నేరాలకు రాజధాని అయింది. కాల్‌మనీ ముఠా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు మంత్రులకు, పోలీసు అధికారులకూ నిధులు సమకూరుస్తున్నట్టుగా ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాకెట్‌లో నిందితులు సీఎంతో, ఇంటెలిజెన్స్ అదనపు డీజీతో కలసి దిగిన ఫొటోలతో పాటు మరో నిందితుడు టీడీపీ ఎమ్మెల్యేతో కలసి విదేశీ విహారయాత్ర చేస్తున్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగానే ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమేయం లేదని రాష్ట్ర డీజీపీ చెప్పడం చూస్తే కేసు విచారణ ఎలా సాగుతోందో అర్థం అవుతోంది. మనీ-సెక్స్ రాకెట్‌ను మేము అసెంబ్లీలో ప్రస్తావించబోతే అధికార పక్షం అంబేడ్కర్ అంశాన్ని చర్చకు తెచ్చి అడ్డుకునేయత్నం చేసింది.

 

 ఇవన్నీ చూసి న తర్వాత మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారం యావత్తూ బాబుకు తెలిసే, ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నట్టుగా రుజువవుతోంది. ఈ నేపథ్యంలో కేసును నీరుగార్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయిం చడం ద్వారా ఇదేదో సాదాసీదా వ్యవహారమే అని చూపాలని బాబు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో సెక్స్ రాకెట్‌పై చర్చ కోసం మేము పట్టుబడితే దాన్నుంచి తప్పించుకునేందుకు మా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. శాసనసభా నిబంధనల ప్రకారం సభ్యుడెవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు.. ఆ సమావేశాల కాలంలో మిగిలి ఉన్న కాలానికే సస్పెండ్ చేయాలి. ఈ నిబంధనను మేము పలుమార్లు అసెంబ్లీలో ప్రభుత్వం, స్పీకర్ దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేదు.  

 

గిరిజన సలహా మండలి ఏర్పాటు తప్పనిసరి

ఏపీలో గిరిజనుల సంక్షేమం, వారి అభివృద్ధి గురించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లోని 4వ పేరా ప్రకారం గిరిజన సలహా మండలి ఏర్పాటు అనేది తప్పనిసరి అంశం. ప్రభుత్వం ఏర్పడి 19 నెలలైనా ఆ ఊసేలేదు. సలహా మండలిని నియమిస్తే అందులో ఎక్కువమంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉంటారనే ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అందుకే తక్షణం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా మనవి చేస్తున్నాం.

 

 ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సలహా ఇవ్వండి

 రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏపీకి తక్షణమే ప్రత్యేక  హోదా ఇవ్వడంతో పాటు కేంద్రం మాకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా మీరు జోక్యం చేసుకోవాలి. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీని మీ దృష్టికి తెస్తున్నాను. రాష్ట్ర విభజన తర్వాత 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆమోదం వరకు ఏర్పడే ఆర్థిక లోటును కేంద్ర బడ్జెట్ (2014-15) నుంచి పూడ్చుతామని ఆరోజు ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యావత్ రాష్ట్రంలోని యువత ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తోంది.

 

ప్రత్యేక హోదా కావాలని కోరుతూ  నేను ఏడు రోజుల పాటు గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేశాను. కనుక మీరు జోక్యం చేసుకుని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సూచించాలని కోరుతున్నాను’ జగన్‌తో పాటు రాష్ట్రపతిని కలసిన వారిలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, శాసనసభాపక్షం ఉప నేతలు ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, భూమా నాగిరెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్న దొర, గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర్‌రావు, ఎం.సునీల్‌కుమార్, శాసనమండలిలో పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top