కొత్త ‘బంగారు’ దొంగలు

కొత్త ‘బంగారు’ దొంగలు

  •  చైన్‌స్నాచింగ్ చేస్తున్న వారంతా కొత్తవారే

  • ఈజీమనీ కోసం యువత అక్రమ మార్గం



  • సాక్షి, సిటీబ్యూరో: మొన్న...కంప్యూటర్ హార్డ్‌వేర్ టెక్నీషియన్ పుట్టి వేదవ్యాస్, కారు డ్రైవర్ గంగాపురం నరేశ్, డిగ్రీ చదివిన పుణుగొటి కృపాకర్...తమ జల్సాల కోసం సులభ పద్ధతిన డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ చేస్తూ నల్లకుంట పోలీసులకు దొరికిపోయారు. వీరిపై గతంలో ఎటువంటి చోరీ కేసులు లేవు. చైన్ స్నాచింగ్‌లు చేయడం వీరికి కొత్త. వీరంతా 30 ఏళ్లలోపు వారే.



    నిన్న...అక్షయ్ శర్మ, సుమీత్ కుమార్. వీరి వయస్సు 20, 21 సంవత్సరాలే. పదో తరగతి వరకు చదివిన అక్షయ్ శర్మ క్యాటరింగ్ పని చేస్తుండగా, సుమీత్ కుమార్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాడు. సయ్యద్ అబ్దుల్ హయ్ అజీమ్ మోహదీతో ఏర్పడిన పరిచయం కాస్తా వీరిని చైన్ స్నాచింగ్‌ల వైపు నడిపించింది. గతంలో అక్షయ్, సుమీత్‌లపై చోరీ కేసులు లేవు. ఈజీ మనీ కోసమే ఈ బాట పట్టారు. వీరు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నారాయణగూడ క్రైమ్ టీమ్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో దొరికిపోయారు. ఈ రెండు కేసులే కాదు...ఇటీవల పోలీసులు ఛేదించిన వివిధ చైన్‌స్నాచింగ్ కేసుల్లో గతంలో ఏ మాత్రం దొంగతనాలతో సంబంధం లేని వారే పట్టుబడ్డారు. దీన్నిబట్టి చూస్తే ఈజీమనీ కోసం యువకులు రెచ్చిపోతున్నారన్నది స్పష్టమవుతోంది. ఇంటి వద్ద నుంచి పంపించే డబ్బులు సరిపోకపోవడం, సిటీ లైఫ్‌స్టైల్ జీవితానికి అలవాటుపడటం...ఉద్యోగం ద్వారా వచ్చే జీతం చాలకపోవడం...ప్రియురాళ్ల కోరికలను తీర్చేందుకు...ఇలా కారణం ఏదైతేనేం దొంగలుగా మారిపోతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా బంగారు గొలుసు దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు.



    తనిఖీలు చేస్తున్నా ...



    ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల వరకు 213 చైన్ స్నాచింగ్ కేసులు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. వీటిలో 63 శాతం వరకు కేసుల్లో దొంగలను పట్టుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. సంచలనం సృష్టించిన సుమిత్రా మృతి కేసులో దొంగపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా పోలీసులు ఇప్పటివరకు ఆ దొంగను పట్టుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోందని సిటీవాసులు అంటున్నారు.  చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రతి జోన్‌లో ఏసీపీ స్థాయి అధికారి వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నా...చైన్ స్నాచర్లు తమ పని తాము కానిచ్చుకొని పోతుండటం పోలీసులను కలవరపెడుతోంది. అయితే బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నది కొత్తవారే కావడంతో వారిని పట్టుకోవడం తలకు మించిన భారమవుతోందని పోలీసు అధికారి ఒకరు వాపోవడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది.    



    ఘరానా దొంగలు జైల్లోనే...



    జంట కమిషనరేట్ల పరిధిలో వివిధ కేసుల్లో 176 మందిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. వీరిలో 162 మందిని జైల్లో పెట్టామని, నిందితుల్లో ఎక్కువ మంది చైన్‌స్నాచర్లు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారి బషీర్‌బాగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. దీన్ని  బట్టి చూస్తే ఇటీవల నగరంలో పెరిగిపోయిన దొంగతనాలు ఎవరూ చేస్తున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్తోంది. ఘరానా దొంగలను జైలు ఊచలు లెక్కిస్తున్నా మరీ బయట పెట్రేగిపోతున్న నవయువ దొంగలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువత ఈజీమనీ కోసం చైన్ స్నాచర్ల అవతారమెత్తుతున్నారు. వీరికి దొంగతనాలు చేయడం కొత్త అయినా, బైక్ రేసింగ్‌లో మంచి అనుభవం ఉండటంతో అలావచ్చి ఇలా క్షణాల్లో గొలుసులు కొట్టుకెళ్తుతున్నారు. ఈ క్రమంలో బాధితురాళ్లు తీవ్రంగా గాయపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత నెలలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో సుమిత్రా తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఇప్పటికీ పోలీసుల ముందు కదలాడుతోంది.  



    సీసీటీవీ కెమెరాల నాణ్యత డొల్ల...



    నిఘా నగరం వైపు అడుగులు వేస్తున్న మన సిటీలో వేలాది సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అయితే చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న యువకులు ఈ కెమెరాల కంటబడుతున్నారు. అయితే నిఘా నేత్రాల నాణ్యత ఉండకపోవడంతో ఆ దృశ్యాలు స్పష్టంగా కనబడటం లేదు. ఒకవేళ ఆ కెమెరాకు చిక్కిన దొంగ మన కళ్ల ముందు వచ్చి నిలబడిన గుర్తుపట్టలేని పరిస్థితి ఉందని ఓ పోలీసు అధికారి వాపోయారు. ఫొటోలున్నా వారిని పట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

     

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top