రాష్ట్రం వచ్చినా ఇంకా అసంతృప్తి

రాష్ట్రం వచ్చినా ఇంకా అసంతృప్తి - Sakshi

  •  ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి

  •  యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

  •  తెలంగాణ రావడమే సర్వరోగ నివారిణి కాదు

  •  గత పాలకులు ఉన్నత విద్యను భ్రష్టు పట్టించారు: దేశపతి

  •  ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి: కోదండరాం

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా నిరుద్యోగ యువతలో అసంతృప్తి కనిపిస్తోందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం రావడం ఒక్కటే అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణి కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ వికాస సమితి, తెలంగాణ సోషల్ ఫౌండేషన్, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ‘ఉన్న త విద్యా రంగంలో ప్రస్తుత సవాళ్లు- వాటి పరిష్కారానికి చర్యలు’ అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించామని, దాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. తద్వారా యువతకు కొంత ఊరట లభిస్తుందన్నారు.



    ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సిలబస్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఈ సదస్సులో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆయా అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు, సీఎం సలహాదారు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సోషల్ ఫౌండేషన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి ఈ సదస్సుకు అధ్యక్షులుగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఆక్టా ప్రతినిధి డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, న్యాయవాది భరత్‌కుమార్  తదితరులు సదస్సులో ప్రసంగించారు.

     

     ‘ప్రైవేటు’ చేతుల్లో ఉన్నత విద్య

     గత ప్రభుత్వాల 60 ఏళ్ల పాలనలో ఉన్నత విద్య ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. వారంతా విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రస్తుతం సంస్కరణలు అవసరం. యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి. ఖాళీలను భర్తీ చేయాలి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలి. వర్సిటీలకు నిధులిచ్చి బలోపేతం చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రైవేటు రంగాన్ని నియంత్రించాలి.    - దేశపతి శ్రీనివాస్

     

     నాటి పరిణామాలే కారణం

     1990 నుంచి  మొదలైన పరిణామాలే ప్రస్తుతం ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం. అప్పట్నుంచే ఉన్నత విద్యలో పెట్టుబడులు పెట్టలేమని ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. 1994 నుంచి మరీ ఎక్కువైంది. ప్రైవేటు భాగస్వామ్యం పెరిగింది. ఉన్నత విద్యను అత్యవసరంగా కాకుండా.. ఒక లగ్జరీగానే చూడాలని ప్రపంచ బ్యాంకు చెప్పడంతో సబ్సిడీలను 25 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. యూనివర్సిటీలను వదిలేసింది. 1989 తర్వాత ప్రొఫెసర్ల నియామకాలు లేవు. ప్రస్తుతం నియామకాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగం బలంగా తయారు కావాలి. వర్సిటీల్లో డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలి.    - ప్రొఫెసర్. కోదండరాం

     

     పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి

     ప్రైవేటు రంగం కేవలం బోధన కే పరిమితమైంది. ప్రభుత్వ రంగం దెబ్బతింది. ఇప్పటికైనా పరిశోధన, అభివృద్ధికి (ఆర్‌అండ్‌డీ) ప్రభుత్వ రంగంలో చర్యలు మొదలు కావాలి. కొత్త రాష్ట్రం అయినందున ఈ దిశగా దృష్టి పెట్టాలి. ఉన్నత విద్యా రంగం దెబ్బతింటే అన్ని రంగాలకు అది సమస్యే అవుతుంది.

     - చెన్నమనేని రమేశ్, ఎమ్మెల్యే

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top