గురు‘వార్’

గురు‘వార్’


 *సిటీలో క్రికెట్ జోష్

 

 సిటీలో క్రికెట్ ఫీవర్.. దృష్టంతా సిడ్నీ వైపే..  




నెల రోజుల క్రికెట్ మహా సంగ్రామం కీలక దశకు చేరుకుంది. గురువారం సిడ్నీలో భారత్  -ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఇవే ముచ్చట్లు... గెలుపోటములపైనే చర్చలు. టీం ఇండియా విజయం సాధించాలంటూ వివిధ సంస్థలు బెస్ట్‌ఆఫ్ లక్ చెబుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో కొందరు సెలవు పెడుతుండగా... నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు కార్పొరేట్ కంపెనీల్లో బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే... భారత్ విజయం సాధిస్తే నెక్లెస్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించేందుకు క్రీడా సంఘాలు ఏర్పాట్లు చేశాయి.

 

 ఇండియాదే కప్

 

ఆస్ట్రేలియాతో వారి గడ్డపై భారత్ సెమీస్ ఆడడం అగ్నిపరీక్షే. భారతీయుడిగా ఇండియా టీం గెలవాలని ఆకాంక్షిస్తున్నాను. వరుస విజయాలతో జట్టు సభ్యుల్లో మనోధైర్యం పెరిగింది.  విజయానికి ఇది చాల కీలకమైనది. గురువారం మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఫైనల్‌లో కూడా భారత్, న్యూజిలాండ్‌తో తలపడుతుంది. న్యూజిలాండ్‌ను ఓడించడం కత్తిమీద సామేనని ఒక క్రికెటర్‌గా భావిస్తున్నా. అయితే ఇండియా కప్ గెలుస్తుందనే నమ్మకం ఉంది.  - సీవీ ఆనంద్, కమిషనర్, సైబరాబాద్

 

 జోరు కొనసాగించాలి..

 

 వరస విజయాలతో మంచి ఫాంలో ఉన్న  మన జట్టు ఆసీస్‌పై విజయం సాధించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో రోహిత్ మొదలుకుని ఆశ్విన్ వరకు అద్భుతాలు చేసే సత్తా ఉన్నవారే.. బౌలింగ్‌లోనూ అందరూ రాణిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్‌తో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఫీల్డింగ్‌ను మరింత మెరుగుపరుచుని  కంగారుల దూకుడును కట్టడి చేయగలిగితే ఇండియా విజయం సునాయసమే. ప్రతి చోటా ఆస్ట్రేలియాను అడ్డుకునే దిశగా కెప్టెన్ ధోని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే సొంత పిచ్‌పై ఆస్ట్రేలియా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.  - వెంకటపతిరాజు, ఇండియన్ టీం మాజీ ప్లేయర్

 

 ఫైనల్లోనూ..ధోనిదే విజయం

 

 ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్‌లో ఇండియా జట్టు నూటికి నూరుశాతం విజయం సాధిస్తుంది. సెమీఫైనల్లో విజయం సాధిస్తే..ఫైనల్లోనూ విజయం సాధించినట్టే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణిస్తున్న ధోనీసేన, ఆస్ట్రేలియా టీం మెంబర్లు రెచ్చగొట్టినా సహనం కోల్పోకుండా విజయం విజయతీరాలవైపు వెళతారన్న నమ్మకం ఉంది. లెఫ్ట్‌హ్యాండర్లు ధావన్, రైనాలతో పాటు మిగిలిన కోహ్లీ, రోహిత్ విజృంభించాలి. ఆల్ దిబెస్ట్ ఇండియన్ ప్లేయర్స్.  - రాజ్‌ ఠాకూర్,స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్

 

 ధోనీ సేనదే విక్టరీ

 

 ఇండియా -ఆస్ట్రేలియా రెండు టీంలకు ఏదైనా చేయగల సత్తా ఉంది. సొంత గ్రౌండ్‌లో ఆడుతుండటం ఆస్ట్రేలియాకు కలిసివచ్చే అంశమే. కానీ ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తూ వస్తున్న ధోని సేన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుందన్న నమ్మకం ఉంది. బౌలింగ్, పటిష్టమైన బ్యాటింగ్ లైనఫ్ ఉన్న దోనీసేన సెమీఫైనల్లో  కంగారులను ఓడిస్తారన్న విశ్వాసం ఉంది.   - శైలజ , సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు

 

 ఏదైనా సాధ్యమే

 

సెమీఫైనల్లో ఏదైనా జరుగొచ్చు. రెండు జట్లు అత్యంత శక్తివంతమైనవే. వరుస విజయాలు ఇండియాకు కలిసి వస్తున్న అంశం.  ఆస్ట్రేలియాకు సొంత మైదానం కావడంతో వారు విజయం కోసం అనేక శక్తులు ఒడ్డే అవకాశం ఉంటుంది. భారత జట్టు ఫీల్డింగ్ మరింత మెరుగు పరుచుకుని, ప్రధాన ఆయుధమైన స్పిన్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను కట్టడి చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ కూడా అతి ప్రధానం కానుంది. మొత్తంగా చూస్తే ఇండియాకు 60 శాతం, ఆస్ట్రేలియాకు 40శాతం విజయావకాశాలు ఉన్నాయి.

 - పీఆర్ మాన్‌సింగ్,  1983 వరల్డ్‌కప్ గెలిచిన ఇండియన్ టీం మేనేజర్

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top