రాజకీయాల్లో మహిళలు కీలకంగా మారాలి

రాజకీయాల్లో మహిళలు కీలకంగా మారాలి


వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాం ధీ, మనతా బెనర్జీ, జయలలితలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరు సల్పి తిరుగులేని నేతలుగా ఎదిగిన విషయం, 1,600 కి.మీ. పాదయాత్ర చేసిన షర్మిల  పట్టుదలను మహి ళా కార్యకర్తలు గుర్తు చేసుకోవాలన్నారు.



గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లోని మహిళా విభాగం బాధ్యతలు నిర్వర్తించేవారు ఇల్లిల్లూ తిరిగి కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు పడుతున్న బాధలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. మహానేత వైఎస్సార్ మహిళల సాధికారత కోసం పడ్డ కష్టం ఏ ముఖ్యమంత్రీ పడలేదన్నారు. మహిళల అభ్యున్నతి కోసం పావలా వడ్డీ రుణాలు తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పుడు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన కల్యాణ లక్ష్మి పథకం బ్రోకర్ల పాలైందన్నారు. రాష్ట్రంలో మహిళలను జాగృతం చేసేందుకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తీవ్రంగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.



వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె. అమృత సాగర్ మాట్లాడుతూ మహిళలు కనిపిస్తే ‘ఈ గ్రామ పంచాయతీ’ల్లో 10 వేల మంది మహిళలకు ఉద్యోగాలు అని మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామ పంచాయతీల్లో ఎంతమంది మహిళలకు ఉద్యోగాలిచ్చారో మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ స్నాచర్లు విజృంభిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  తెలంగాణ రాష్ట్రంలో మహిళల కు రక్షణ కరువైందని వాపోయారు.



వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకూ స్థానం లేదన్నారు. మహిళలకు మేలు చేసే పథకాలు కేసీఆర్ ఒక్కటి కూడా తీసుకురాలేక పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం శ్యామల, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల మహిళా విభాగాల అధ్యక్షురాళ్లు ఇందిర, బి. పద్మ, పలువురు రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top