ఆరు గంటలు.. ఐదు స్నాచింగ్స్

ఆరు గంటలు.. ఐదు స్నాచింగ్స్


- నగరంలో మరోసారి రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

 

సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఒక రోజే.. ఆరు గంటల వ్యవధిలోనే.. ఐదు చోట్ల గొలుసు దొంగతనాలకు తెగబడ్డారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే.. అంటే ఆరు గంటల సమయంలోనే నాలుగు ప్రాంతాల్లో అపహరణలకు పాల్పడ్డారు. వనస్థలిపురం, నాగోల్, మల్కాజిగిరి, కుషాయిగూడ ప్రాంతాల్లో పల్సర్, ఖరిజ్మా బైకులపై వచ్చిన చైన్‌స్నాచర్లు ఒంటరిగా వెళుతున్న ఐదుగురు మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. స్నాచర్లను ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మొత్తం 19 తులాల బంగారాన్ని స్నాచర్లు ఎత్తుకెళ్లినట్టు సమాచారం.



వనస్థలిపురం.. ఉదయం 6 గంటలకు..

భాగ్యలత బీడీఎల్ కాలనీలో నివాసముండే ఎ.జయమ్మ(65) భర్త సోమయ్యతో కలసి శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైకోర్టు కాలనీకి వాకింగ్‌కు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తుండగా హైకోర్టు కాలనీ మలుపు వద్ద బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు జయమ్మ మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును తెంచుకుని పారిపోయాడు.



నాగోల్.. ఉదయం 8.30 గంటలకు..

నాగోల్‌లోని బండ్లగూడ కృషినగర్‌లో నివాసముంటున్న వై.సుశీలమ్మ(65) శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడింది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. శ్రీనివాస్ ఇల్లు ఎక్కడా అని ఆమెను అడిగారు. తనకు తెలియదని సుశీలమ్మ బదులిచ్చేలోపే ఆమె మెడలోని బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశారు. సుశీలమ్మ పుస్తెలతాడును పిన్నీస్‌తో చీరకు పెట్టుకోవడంతో స్నాచర్లు లాగడంతో వెంటనే రాలేదు. దీంతో బలవంతంగా లాగడంతో తాడు తెగి సుశీలమ్మ కిందపడిపోయింది. సగం పుస్తెలతాడుతోనే స్నాచర్లు పరారయ్యారు. సుశీలమ్మ కిందపడడం గమనించిన కొడుకు వరదరాజు, చుట్టుపక్కల వారు వచ్చేసరికి స్నాచర్లు అక్కడి నుంచి జారుకున్నారు. సుశీలమ్మ ఎడమ చేయి, కాలు తుంటి భాగాలకు గాయాలవ్వడంతో ఆమెను చికిత్స కోసం కొత్తపేటలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు.



మల్కాజిగిరి.. ఉదయం 11.00 గంటలకు

ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న తాళ్లబస్తీకి చెందిన పూర్ణిమ(38) శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లోని ఆంధ్రాబ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేయడానికి బయలుదేరింది. బ్యాంక్ కాలనీలోని చర్చి సమీపానికి రాగానే బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలోని గొలుసు లాగడానికి ప్రయత్నించగా పూర్ణిమ ప్రతిఘటించింది. దీంతో గొలుసు తెగిపోవడంతో సుమారు తులంన్నర బంగారు గొలుసుతో ఉడాయించాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఉదయం 11.30 నుంచి 11.45 గంటల మధ్యలో భ్రమరాంబికా నగర్‌కు చెందిన గృహిణి రాధ(35) మెడలోని ఏడు తులాల రెండు బంగారు ఆభరణాలను బైక్‌పై వచ్చిన వ్యక్తి తెంపుకుని పరారయ్యాడు.



కుషాయిగూడ.. ఉదయం 12 గంటలకు

మౌలాలి హాసింగ్‌బోర్డు కాలనీకి చెందిన గృహిణి మన్నె కమలమ్మ (51) ఇంట్లో సరుకుల కోసం సమీపంలోని దుకాణానికి శనివారం ఉదయం 11.45 నుంచి 12 గంటల సమయంలో బయలుదేరింది. ఒంటరిగా వెళుతున్న కమలమ్మను గమనించిన దొంగ  ఆమె మెడలోని నాలుగు తులాల గొలుసును లాక్కుని.. అప్పటికే అక్కడ బైక్‌పై సిద్ధంగా ఉన్న వ్యక్తితో కలసి పారిపోయాడు. మధ్యాహ్నం లోపే స్నాచింగ్ వివరాలు తెలియడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు తెప్పించుకుని పరిశీలించారు. ఇవి అంతర్రాష్ట్ర ముఠాల పనిగా భావిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top