క్లాసికల్ డ్యాన్స్‌తోనే భవిష్యత్తు..

క్లాసికల్ డ్యాన్స్‌తోనే భవిష్యత్తు.. - Sakshi


బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్

 సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి : ‘ఏ డ్యాన్స్‌లో రాణించాలనుకున్నా ముందస్తుగా సంప్రదాయ నృత్యం సాధన చేయాల్సిందే. క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం సాధిస్తే ఏ డ్యాన్సయినా సులువుగా చేయవచ్చు. నృత్యంలో రాణించాలనుకున్నవారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సూచించారు ప్రసిద్ధ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్. నగరానికి చెందిన ప్రసిద్ధ ఒడిస్సీ నృత్యకారిణి సోనాలి ఆచార్జీ మాదాపూర్‌లోని సోనాలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడ్రన్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు.



ఈ సందర్భంగా సరోజ్‌ఖాన్ మాట్లాడుతూ తాను ప్రాథమికంగా క్లాసికల్ డ్యాన్సర్‌ని కాబట్టే విభిన్న రకాల పాటలకు నృత్యాలను అందించగలిగానన్నారు. అయితే ఇప్పుడు సినిమాల్లో వచ్చే డ్యాన్స్‌లు చూస్తుంటే అవేమిటో తనకే అర్థం కావడం లేదన్నారు. కొన్ని సినిమాల్లో కొరియోగ్రాఫర్‌తో సంబంధం లేకుండానే డ్యాన్స్‌లు  చేసేస్తున్నారని, ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో పాటకు హీరోనే డ్యాన్స్ డెరైక్షన్ చేసేశాడని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో, పొట్టి పొట్టి దుస్తుల హీరోయిన్లతో పనిచేయలేకే బాలీవుడ్‌లో కొరియోగ్రఫీ చేయడం లేదన్నారు.



హైదరాబాద్‌లో సోనాలితో కలిసి ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించడం సంతోషంగా ఉందంటూ ప్రతి 2 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి స్టూడెంట్స్ ప్రతిభను పరిశీలిస్తానని, అలాగే రానున్న దీపావళికి 11 రోజుల పాటు ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి తెలుగు సినీ దర్శకులు కె.విశ్వనాథ్ మాట్లాడుతూ సంప్రదాయ నృత్యం, సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. సంగీతం, పాటలు తప్ప ఏముంటాయి ఆయన సినిమాలో అంటూ కొందరు విమర్శించినా... సిరిసిరిమువ్వ దగ్గర్నుంచి తన ప్రతి సినిమాలో వాటికే పెద్ద పీట వేశానని గుర్తు చేశారు.



 మన సంప్రదాయ మూలాల్ని మరిచిపోతే మనకంటూ ఉన్న గుర్తింపు కోల్పోతామని పిల్లలకు ఈ విషయంలో అవగాహన పెంచాల్సిన బాధ్యత పెద్దలదేనన్నారు. ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు సోనాలి మాట్లాడుతూ సంప్రదాయ ఒడిస్సీతో పాటు బాలీవుడ్ నృత్యాల్లో కూడా తాము శిక్షణ అందిస్తామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top