‘ఆళ్లగడ్డ’ ఉప ఎన్నికపై వారంలో స్పష్టత!


హైకోర్టు పరిధిలో ఉన్న ఉప ఎన్నిక కేసు

కేసు విచారణను త్వరితగతిన చేపట్టాలని ఎన్నికల సంఘం అభ్యర్థన

శుక్రవారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే విషయంలో వచ్చే వారంలోగా స్పష్టత వచ్చే అవకాశ ముంది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు సంబంధించిన కేసు హైకోర్టు పరిధిలో ఉంది. దీంతో హైకోర్టు నుంచి స్పష్టత తీసుకున్నాకే ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికలసంఘం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈసీ తరఫు న్యాయవాది ఆ కేసును సత్వరమే విచారణకు వచ్చేలా కేసుల జాబితా(కాజ్‌లిస్ట్)లో చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీ ని కోరినట్లు తెలిసింది. ఈ కేసు గురువారం విచారణకు వస్తుందని భావించినప్పటికీ, కాజ్‌లిస్ట్‌లో కనిపించలేదు. దీంతో శుక్రవారం లేదా వచ్చే వారం లోపు ఏదో ఒకరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది.



అదేరోజు ఉపఎన్నిక నిర్వహణపై హైకోర్టు ధర్మాసనం సైతం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా శోభానాగిరెడ్డి పోటీ చేశారు. అరుుతే ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఈ నేపథ్యంలో శోభానాగిరెడ్డి పేరు యథాతథంగా బ్యాలెట్ పేపర్‌లో ఉంటుందని, ఆమెకు అత్యధిక ఓట్లు వస్తే ఆమెను గెలిచినట్లు ప్రకటించి, తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో కర్నూలు జిల్లా రుద్రవరం మండలం, ఎర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన బి.హర్షవర్థన్‌రెడ్డి, చిన్నకంబలూరుకు చెందిన జంగా వినోద్‌కుమార్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.



శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ నుంచి తొలగించేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అంతేకాక ఆ ఎన్నిక తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. దీంతో ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథంగా జరిగింది. శోభానాగిరెడ్డికే అత్యధిక ఓట్లు వచ్చాయి. శోభానాగిరెడ్డి గెలిచినప్పటికీ, ఆమె మరణించిన కారణంగా ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే మెదక్ పార్లమెంట్, నందిగామ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆళ్లగడ్డ విషయంలో మాత్రం హైకోర్టు నుంచి స్పష్టత తీసుకున్న తరువాతే ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం న్యాయవాది ఈ కేసును కాజ్‌లిస్ట్‌లో చేర్చాలని హైకోర్టును కోరినట్లు సమాచారం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top