వైట్‌టాప్.. సిటీ టిప్‌టాప్!

వైట్‌టాప్.. సిటీ టిప్‌టాప్! - Sakshi


ఒక్క వాన కురిస్తే చాలు.. నగరంలో ఎక్కడికక్కడ గుంత లు, మోకాళ్లలోతు నీళ్లు. ప్రత్యక్ష నరకం చూపిస్తున్న రోడ్ల సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. దీనికి వైట్ టాపింగే మార్గమనే నిర్ణయానికొచ్చారు. దశలవారీగా వెయ్యి కిలోమీటర్ల మేర ఈ తరహా రోడ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మినిస్టర్ రోడ్ వరకు దాదాపు 1.3 కి.మీ. మేర వైట్‌టాపింగ్‌కు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. వర్షాలు పడుతుండటంతో పనులు సాగడం లేదు.



గతేడాది జూలై చివరలో బంజారాహిల్స్‌లో సిమెంట్ ఉత్పత్తిదారుల సమాఖ్య నిర్మించిన వైట్‌టాపింగ్ రోడ్డుతో వాహనదారులు సంతృప్తికరంగా ఉన్నారు.  దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ రోడ్ల కోసం విజ్ఞప్తులు అందుతున్నాయి.   


 

నగరంలో వైట్‌ టాప్ రోడ్లు

దశల వారీగా వెయ్యి కి.మీ.

గుంతలు పడవు.. మన్నికెక్కువ..

నిర్వహణ వ్యయమూ తక్కువే

50 శాతం విద్యుత్ ఆదా


 

మన్నిక... నాణ్యత...


వాస్తవానికి గతేడాదే దాదాపు వెయ్యి కి.మీ. రోడ్లను వైట్‌టాపింగ్‌తో నిర్మించాలని భావించారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నే పథ్యంలో నెల రోజుల్లోనే రోడ్ల నిర్మాణం పూర్తిచేయాల్సిరావడంతో ఈ ఆలోచన విరమించుకుంది. ఇటీవల నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లను కళ్లారా చూసిన మంత్రి కేటీఆర్... ఆధునిక టెక్నాలజీతో కూడిన వైట్‌టాపింగ్ రోడ్లను వేసే ఆలోచన ఉందని తెలిపారు. వైట్ టాపింగ్ అంటే వాస్తవానికి సిమెంటు రోడ్లే.



కాకపోతే పూర్తిగా సిమెంటుతో కాకుండా బీటీ పైభాగాన తిరిగి బీటీతో రీకార్పెటింగ్ బదులు  పోర్ట్‌లాండ్ సిమెంటుతో కార్పెటింగ్ చేస్తారు. దీంతో బీటీ రోడ్లు వైట్‌గా మారతాయి కనుక వీటిని వైట్ టాపింగ్ రోడ్లుగా వ్యవహరిస్తున్నారు. వైట్‌టాపింగ్ రహదార్లపై తక్కువ ఓల్టుల బల్బులు చాలు. ప్రకాశవంతంగా కనబడటంతో రాత్రివేళ ప్రమాదాలు తగ్గుతాయి. ఫలితంగా 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అంచనా.  

 

నిధుల మిగులు...

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో ప్రస్తుతం రూ.400 కోట్లు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చులకే వినియోగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో అన్ని రకాల రోడ్లు వెరసి 9,103 కి.మీ. వీటిల్లో బీటీ రోడ్లు 4,173 కి.మీ. నాలుగైదు సంవత్సరాల్లో ఏటా సగటున రూ.300 కోట్లు ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం అంతంతమాత్రమే. అదే వైట్ టాపింగ్ రోడ్డును ఒకసారి వేస్తే 30 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి. పెద్దగా మరమ్మతులు అవసరం లేదు. బీటీ రీకార్పెటింగ్/మరమ్మతులకు వెరసి కి.మీ.కు అయ్యే వ్యయం దాదాపు రూ. 25 లక్షలు.

* 30 ఏళ్లకయ్యే వ్యయం రూ. 7.5 కోట్లు  

* వైట్ టాపింగ్ రోడ్డుకయ్యే ఖర్చు దాదాపు రూ. 2 కోట్లు

* అంటే కి.మీ. రహదారిని పరిగణనలోకి తీసుకుంటే వైట్‌టాపింగ్, బీటీ రీకార్పెటింగ్/మరమ్మతుల మధ్య వ్యత్యాసం రూ. 5.5 కోట్లు

* 4వేల కి.మీ. బీటీ రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 22 వేల కోట్ల ఖర్చు తగ్గుతుంది.

 

ఇతర నగరాల్లోనూ...

* ముంబై, నాగ్‌పూర్, చెన్నై, ఇండోర్‌లతో పాటు పలు నగరాల్లో వైట్‌టాపింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు.

* మైసూర్ మహారాజా సమయంలో నిర్మించిన బెంగళూర్- మైసూర్ రహదారి దశాబ్దాల పాటు మన్నికగా ఉంది   

* ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద 1939లో నిర్మించిన ఆ రోడ్డు ఇప్పటికీ వాడుకలో ఉంది.  

* అమెరికా, యూరప్‌లలో వైట్ టాపింగ్ రోడ్లు వినియోగంలో ఉన్నాయి.

 

హైదరాబాద్‌కు అనుకూలం...  

* కి.మీ. వైట్ టాపింగ్ పని వారంలో పూర్తిచేయవచ్చు. అదే సీసీ వేయాలంటే నెలలు పడుతుంది.

* 50 శాతం విద్యుత్ ఆదా కాగలదని అంచనా. వైట్‌టాపింగ్ రహదార్లపై తక్కువ ఓల్టుల బల్బులు చాలు. ప్రకాశవంతంగా కనబడటంతో రాత్రివేళ ప్రమాదాలు తగ్గుతాయి.

* వాహనాలు స్లిప్ కాకుండా రోడ్డుపై చారలుగా పూత ఉంటుంది. టైర్లు కూడా ఎక్కువ రోజులు మన్నుతాయి.

* పది శాతం ఇంధనం ఆదా అవుతుంది. దాంతో పాటు కాలుష్యం వెదజల్లే సీఓ2, ఎన్‌ఓ2, ఎస్‌ఓ2లు తగ్గుతాయి.

* గుంతలు, కుదుపులు లేనందున వాహనాల నిర్వహణఖర్చు కూడా తగ్గుతుంది. వాన నీటి నిల్వ ఉండదు.  

* బీటీ రోడ్డు పైభాగాన్ని 5 అంగుళాల మందం తొలగించవచ్చు. నూరు శాతం రీసైక్లింగ్‌కు అనుకూలం.

* అయితే 30 ఏళ్లు మన్నికగా ఉండేందుకు ఒకసారి రోడ్డు వేశాక తిరిగి తవ్వకూడదు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top