కొత్త జిల్లాల విభజనలో శాస్త్రీయత ఏదీ?

కొత్త జిల్లాల విభజనలో శాస్త్రీయత ఏదీ? - Sakshi


వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివకుమార్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల విభజనలో పూర్తిగా శాస్త్రీయత లోపించిందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ విమర్శించారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకం కాదని తెలిపారు. సీఎం కేసీఆర్ స్వప్రయోజనాల కోసం జరిగే కొత్త జిల్లాల విభజన ను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.



‘తాంబూలాలిచ్చాం... తన్నుకు చావండి అన్న రీతిలో టీఆర్‌ఎస్ ప్రజల మధ్య జిల్లాల చిచ్చు పెట్టింది. 64 మండలాలుగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా, ఆరు రెవెన్యూ డివిజన్లుగా చేశారు. అదే 46 మండలాలున్న మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా, ఏడు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. పది మండలాలున్న మల్కాజ్‌గిరిని ఒక జిల్లా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరినా చేయలేదు. 20 సంవత్సరాలుగా ప్రజలు కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లాలో ప్రజలు జనగామను జిల్లాగా చేయాలని ధర్నాలు, నిరసనలు చేస్తూంటే అది కాదని ప్రజలు కోరని హన్మకొండను జిల్లా చేశారు’ అని వివరించారు.

 

ఏ ప్రాతిపదికన చేశారు?

జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన చేశారో అర్థం కావడం లేదని శివకుమార్ అన్నారు. ‘459 మండలాలను 505 మండలాలుగా, పది జిల్లాలను 27 జిల్లాలుగా చేశారు. తహసీల్దార్‌లకు తెలియకుండానే మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరిగిపోయిరది. జిల్లా ముసాయిదా ఎలాంటి కసరత్తు లేకుండానే విడుదల చేశారు. నగరంలోని హయత్ నగర్ ఎక్కడ.. శంషాబాద్ ఎక్కడ.. రెండింటినీ కలపడం ఏంటి? జిల్లాల ఏర్పాటు కోసం ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితిని సీఎం కేసీఆర్ కల్పించారు.



ఐదు రోజుల క్రితం డ్రాఫ్ట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తే.. ఆన్‌లైన్‌లో 6 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఇవి లక్షకు చేరుకునే పరిస్థితులున్నాయి. జిల్లాల వారీగా వచ్చిన ఫిర్యాదు కాపీలను రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేయాలి’ అని ఆయన కోరారు. జిల్లాల విభజనపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే.. ప్రజలు మాత్రం రోడ్లపైకి చేరుకొని సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారని శివకుమార్ అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top