నీలిమ ఎక్కడ..?

నీలిమ ఎక్కడ..? - Sakshi


ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లిన హైదరాబాదీ ఆచూకీ గల్లంతు

సమాచారం తెలియక ఆందోళనలో తల్లిదండ్రులు..




హైదరాబాద్: ఎవరెస్ట్ అధిరోహణకు నేపాల్ వెళ్లిన నగరానికి చెందిన ఓ యువతి భూకంపంలో చిక్కుకొని గల్లంతయ్యింది. ఆమెకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ సంస్థ ‘వీరాంబులెస్’ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేం దుకు వివిధ దేశాలకు చెందిన 21 మందితో సాహస బృందాన్ని ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌లోని మెహిదీపట్నానికి చెందిన శౌరయ్య, డాక్టర్ పాప కొండేటి దంపతుల చిన్న కూతురు డాక్టర్ నీలిమ (28) కూడా ఎంపికైంది. నీలిమ గచ్చిబౌలీలోని కాగ్నిజెంట్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తోంది.

 

ఈ నెల 18న బెంగళూరు వెళ్లిన నీలిమ అక్కడి నుంచి 21న ఢిల్లీ మీదుగా కఠ్మాండుకు చేరుకుంది. అక్కడి నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించే బృందం సభ్యులతో కలసి బేస్ క్యాంప్-సీకి 22వ తేదీన చేరుకుంది. అక్కడి నుంచి తల్లికి ఫోన్ చేసిన నీలిమ తాము ఎవరెస్ట్‌పై 4,600 మీటర్ల ఎత్తుకు చేరిన్నట్లు చివరిసారిగా ఫోన్ చేసింది. ఏదైనా అవసరం ఉండే ఫోన్ చేయడానికి అత్యవసర నంబర్ కూడా ఇచ్చింది. అయితే శనివారం నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో నీలిమ తల్లిదండ్రులు ఆమె సురక్షితంగా ఉందో లేదో తెలుసుకునేందుకు అత్యవసర నంబర్‌కు ఫోన్ చేశారు.

 

ఆ ఫోన్ కలవకపోవడంతో బెంగళూరులోని వీరాంబులెస్ సంస్థకు శనివారం ఫోన్ చేశారు. 21 మందితో కూడిన బృందం సురక్షితంగా ఉందని, బింగ్ బోబో అనే ప్రాంతంలో ఉన్నారని సంస్థ ప్రతినిధులు తొలుత సమాధానమిచ్చారు. శనివారం సాయంత్రం ఆ సంస్థ వారు మరోమారు ఫోన్ చేసి సాహస బృందం జాడ తెలియడం లేదని సమాచారమివ్వడంతో నీలిమ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


2 నెలల క్రితం ఎంతో మందిలో తెలుగు రాష్ట్రాల తరఫున తమ అమ్మాయి ఎంపిక కావడంతో గర్వంగా భావించామని, తీరా ఇప్పుడు ఆమె ఆచూకీ తెలియకపోవడం తమను మానసికంగా కలచి వేస్తోందని ఆమె తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు. తమ కూతురు ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రక్షించాలని వేడుకుంటున్నారు.

 

 కాక్‌పిట్ నుంచి ఫొటో: ఈ నెల 21న ఢిల్లీ నుంచి కఠ్మాండుకు వెళ్తుండగా నీలిమ విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లి పెలైట్‌తో సెల్ఫీ దిగి తల్లికి పంపింది. తమ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా, ఉద్విగ్నంగా సాగుతోందని ఆమె తల్లికి ఫొటోతో పాటు మెసేజ్ కూడా పంపించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top