రూ.150 ఇచ్చి మోసపోయానా?

రూ.150 ఇచ్చి మోసపోయానా?


(వెబ్ సైట్ ప్రత్యేకం)


వారం రోజుల తర్వాత మళ్లీ హైదరాబాద్ లో అడుగుపెట్టాను. ఆఫీస్ కు సెలవు పెట్టి తిరుమల వెంకన్న ఆశీస్సులతో ఇంటికి వస్తున్న నాకు బస్సు దిగగానే ఓ అనుభవం ఎదురైంది. ఇలాంటిదే మీలో ఎవరికైనా ...ఎదురై ఉండొచ్చు కూడా..



ఇల్లు దగ్గరేనని బస్సు దిగి నాలుగడుగులు వేశాను. ఇంతలో 35-40 ఏళ్ల మధ్య వయస్సు ఉండే ఒకామె నన్ను ఆపింది. ఏమండి ఏమనుకోవద్దు.. ఇలా అడుగుతున్నానని.... మాకు తెలిసినవాళ్లు ఇల్లు మారిపోయారు. ఫోన్ నెంబర్ కూడా లేదు. మా దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి. మా ఊరు వెళ్లడానికి డబ్బులు లేవు. కొంచెం హెల్ప్ చేయరా అని.



ఆమె వైపు చూశాను. భుజానికి హ్యాండ్ బ్యాగ్... పక్కన 12ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. బహుశా ఆమె కొడుకు అనుకుంటా.

నమ్మాలా వద్దా అని నాలో అనుమానం. మీది ఏ ఊరు అని అడిగా... మాది గుంటూరు దగ్గర పిడుగురాళ్ల అని చెప్పింది. చూస్తే మోసం చేసి డబ్బు అడుగుతున్నట్లు అనిపించలేదు.



అయ్యో పాపం అనిపించింది. పక్కనే పిల్లాడు కూడా ఉన్నాడు. ఒకవేళ అబద్ధం చెప్పి డబ్బులు అడిగేవాళ్లు అయితే అంత  ఉదయాన్నే అలా రోడ్డు మీద నిలబడి అడగరు కదా అనిపించింది.



ఇంకేమీ ఆలోచించకుండా బ్యాగ్ లో నుంచి చేతికందిన ఓ వంద, యాభై రూపాయిల నోట్లు ఇచ్చాను. ఆమె కూడా అంత ఇస్తానని ఊహించినట్లు లేదు.



ఓ ఇరవై, లేదా యాభయ్యో ఇస్తానని అనుకుని ఉందేమో ...నేను వంద ఇవ్వగానే ఆశ్చర్యంతో పాటు, సంతోషంగా ఆనోటును తీసుకుంది.



అబ్బా వంద రూపాయిలు ఇచ్చి...ఏదో లక్ష దానం చేసినట్లు ఫోజ్ కొడుతున్నానని అనుకుంటున్నారు కదు. అంతటితో అయిపోతే సరే. మరో రెండుసార్లు ఆమె ఆ పిల్లాడితో నాకు తారస పడింది.



ఓ రోజు ఆఫీస్ అయిపోయి బస్సు దిగి ఇంటికి వెళుతుంటే మళ్లీ ఆమె నాకు కనిపించింది. అయితే ముఖానికి స్కార్ప్ కట్టుకున్న ఆమె నన్ను గుర్తు పట్టలేదు కానీ ..ఆమెను మాత్రం నేను వెంటనే గుర్తుపట్టాను. అదేంటీ ఆమె వాళ్ల ఊరు వెళ్లలేదా ఇక్కడుంది ఏమిటా అని ఆలోచిస్తూ ఆమె వైపు చూశాను. అయితే కొద్దిసేపు ఉండి ఆమె ఏం చేస్తుందో చూద్దామనుకున్నా కానీ... ఓ వైపు ఎండ దంచేస్తోంది. చెమటలు కారిపోతున్నాయి. దాంతో సర్లే ఎందుకొచ్చిన డిటెక్టివ్ పని అనుకుని వెళ్లిపోయా.

 

తర్వాత రోజు.... ప్లేస్ మారింది...

ఆఫీస్ కు వెళ్లేందుకు కూకట్ పల్లి నుంచి డైరెక్ట్ బస్సు దొరకకపోవటంతో అమీర్ పేట బస్టాఫ్ లో దిగాను. అప్పుడు కూడా నా ముఖం స్కార్ప్ తో కప్పేసే ఉంది.



అక్కడ ఆమె...తన పిల్లాడితో నిలబడి ఉంది. ఇదేంటబ్బా ఈమె ఇలా కనిపిస్తోంది నాకు అని అనుకున్నా. ఊరు వెళ్లేందుకు బస్సు కోసం చూస్తుందేమో అనుకున్నా...అయినా ఓ నూట యాభై రూపాయిలు ఇచ్చి ...ఇంత ఆలోచించడం అవసరమా అని నాలో నేనే సర్ధి చెప్పుకున్నా.



ఆమె వైపే చూస్తున్నా.. ఏం చేస్తూందా అని ఇంతలో అక్కడకి వచ్చిన ఒకామెతో సేమ్ టూ సేమ్... అవే మాటలను రిపీట్ చేస్తోంది. ఏమండి... మా వూరు వెళ్లడానికి డబ్బులు లేవండీ...పర్సు పోయిందండీ అంటూ... ఆ పిల్లాడు కూడా ఆమెతో పాటు నిలబడి అమాయకంగా చూస్తున్నాడు...



నాకు పిచ్చి కోపం వచ్చింది... అదేంటీ నాలుగు రోజుల క్రితం కూడా ఇలాగే చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంది. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తోందని. ఓ వైపు నన్ను మోసం చేసి డబ్బులు గుంజిందని, మరోవైపు నేను మోసపోయాననే ఉక్రోషం.



దగ్గరకు వెళ్లి ఏయి ఇలా ఎంతమందిని మోసం చేసి డబ్బులు గుంజుతావ్. మర్యాదగా నా డబ్బులు నాకిచ్చేయి లేకపోతే. పోలీసులకు పట్టిస్తా అని బెదిరిద్దామనేంత ఆవేశం వచ్చింది.



అయితే ఇంతలో నేను ఎక్కాల్సిన బస్సు వస్తోంది. ఓవైపు ఆఫీస్ కు టైమ్ అయిపోవటంతో అయ్యో ఈ బస్సు ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటూ ...ఆమె వైపు కసిగా చూస్తూ బస్సు ఎక్కేశా.



ఆఫీస్ కు వెళ్లాక కూడా బుర్రలో ఆ విషయమే తొలుస్తోంది. ఛా ఇంత చిన్న విషయానికి ఎందుకింతగా ఆలోచిస్తున్నానని తల విదిలించినా ఆలోచనలు మాత్రం నీడలా వదలటం లేదు.



దాదాపు ఇలాంటి సంఘటనలే గతంలో నేను చాలాసార్లు చూశాను. ఎక్స్ క్యూజిమీ నా పర్సు పోయిందంటూ దడదడ ఇంగ్లీష్ లో దంచేసి...చివరకూ ఓ వంద ఉంటే ఇస్తారా...ఎట్ లీస్ట్ 50 అంటూ రైల్వేస్టేషన్లలో కాళ్లబేరం ఆడేవాళ్లను చూశా.



ఇల్లు కాలిపోయింది, సర్వం బూడిదై రోడ్డున పడ్డాం సాయం చేయమని, కొడుకుకు జబ్బుచేసింది తిరిగి కోలుకోవాలంటే వైద్యం చేయించేందుకు డబ్బు కావాలని, కూతురు పెళ్లి చేయాలి..పేదోళ్లమంటూ బస్సులు ఎక్కి మరీ కాగితాలు పంచేవాళ్లు... అనాధలను, ముసలివాళ్లను చేరదీసి స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నామని ఇంటికి వచ్చి జబర్దస్తుగా విరాళాలు వసూలు చేసేవాళ్లను చూశా.



కొన్నిసార్లు అయ్యో పాపం అని జాలిపడి సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్లు మళ్లీ మళ్లీ మన కళ్ల ముందే దర్జాగా తన దంతా సాగిస్తూనే ఉన్నా ఏం చేయలేం. ఎవరి పాపం వాళ్లదే అని సరిపెట్టుకునే సందర్భాలే ఎక్కువ. ఇంతకీ వాళ్లు అబద్ధాలు చెబుతున్నారా? మనం మోసపోతున్నామా? ఇలాంటి వాళ్లవల్ల సహాయం చేయాలనే ఆలోచన కనుమరుగు అవుతుందోమో.


పార్వతి

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top