దుమ్ముగూడెంతో మనకేం లాభం?


ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిరాసక్తత



సాక్షి, హైదరాబాద్: గోదావరి వరద నీటి మళ్లింపుద్వారా నాగార్జునసాగార్ కుడి, ఎడమ కాల్వల కింద ఆయకట్టు స్థిరీకరణకోసం ఉద్దేశించిన దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ టేల్‌పాండ్ ప్రాజెక్టు పనుల కొనసాగింపుపై తెలంగాణ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ప్రాజెక్టుతో తెలంగాణకు వచ్చే ప్రయోజనాలు స్వల్పంగా, నిర్మాణానికి అయ్యే వ్యయం భారీగా ఉండటంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంపై ఊగిసలాటలో పడింది.

 

తెలంగాణ ప్రయోజనాల వరకు ప్రాజెక్టును కుదించి నిర్మాణం కొనసాగించాలని గతంలో భావించిన ప్రభుత్వం, ప్రస్తుతం పూర్తిగా ప్రాజెక్టును నిలిపివేయాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రాజెక్టు పనులకోసం సుమారు రూ.700 కోట్ల మేర ఖర్చు చేసినందున ప్రాజెక్టు రద్దు అంత సులభం కాదని భావిస్తున్న ప్రభుత్వం, దీని సాధ్యాసాధ్యాలు, ఇతరత్రా మార్గాలపై అన్వేషణ జరుపుతోంది. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో రద్దు చేసే పరిస్థితుల్లో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం, అన్ని అంశాలను క్రోడీకరించుకునే పనిలో పడింది. అంతిమ నిర్ణయం మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిదేనని తెలుస్తోంది.

 

ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష: ఈ ప్రాజెక్టును కొనసాగించాలా? లేక రద్దు చేయాలా? అన్న అంశంపై గురువారం జలసౌధలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు విదాయసాగర్‌రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, దుమ్ముగూడెం చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

ప్రాజెక్టును రద్దు చేస్తే తలెత్తే సాంకేతిక, న్యాయపర చిక్కులపై చర్చించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యక్తమయ్యే అభ్యంతరాలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనా ఈ సమావేశంలో చర్చించారు. అయితే ప్రాజెక్టు కొనసాగింపు లేక రద్దుపై ఇంకా నిర్ణయానికి రాలేదని, దీనిపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top