మన తాతల ముత్తాతల తలలపై ‘పెళ్లి పన్ను’


వెలుగుచూసిన నిజాం కాలం నాటి అరుదైన తామ్ర శాసనం

 

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లంటే కట్నాలు.. కానుకలు.. సారెలు.. చీరలు.. అబ్బో ఎంతో ఖర్చు! పెద్దపెద్ద షాపులకు పెళ్లి సరుకులు కొనాలంటే ప్రతీ వస్తువుపై ఎంతోకొంత పన్ను చెల్లించాల్సిందే. తాజాగా తెచ్చిన జీఎస్టీతో గరిష్టంగా కొన్నింటిపై 18 శాతం దాకా పన్ను వసూలు చేస్తున్నారు. మరి దాదాపు 200 ఏళ్ల కిందట నిజాం హయాంలో పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా పన్ను వసూలు చేశారు. పెళ్లి చేస్తే ప్రభుత్వానికి రూపాయి పావలా పన్నుగా చెల్లించేవారట! అలాగే ప్రతి రైతు భూమి సాగు చేసుకున్నందుకు సాలీనా అర్ధ బేడ (62 పైసలు) కప్పం కట్టాలి. రబీ పునాసలో ఒక అరక ఉండి ఐదు బిగాల భూమి దున్నితే 50 పైసలు చెల్లించాలి.



అంతేకాదు.. తెలంగాణలో ఘనంగా నిర్వహించుకునే దసరా పండక్కి పెద్ద ఊరైతే రూపాయి, చిన్న ఊరైతే యాభై పైసలు చెల్లించాలి. ఇక కర్రతో కట్టిన ఇల్లు ఉంటే ఉంటే.. పెద్ద ఇంటికి అడ్డెడు, చిన్న ఇంటికి మానెడు ధాన్యం పన్నుగా కట్టాలి. తాజాగా వెలుగుచూసిన నిజాం కాలం నాటి ఓ తామ్ర శాసనంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. గోదావరి నదికి ఉత్తరాన మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల నుంచి నిజాం ప్రభుత్వం వసూలు చేసే కప్పం వివరాలు ఈ శాసనంలో ఉన్నాయి. 1871లో రూపొందించిన ఆ శాసనం ఇప్పుడు బయటపడింది. 1824 ప్రాంతంలో నాటి నిజాం ప్రభుత్వం ఈ ప్రాంతంలోని వెలమ దొరలకు దేశ్‌ముఖ్‌ల పేరుతో అధికారాన్ని కట్టబెట్టింది. వారు గిరిజన ప్రాంతాల నుంచి పన్నులు వసూలు చేసేవారు. అందుకు కొందరు గిరిజన నేతలను మొకాశీలుగా నియమించుకునేవారు. 

 

ఏముంది అందులో..?

పన్నుల వివరాలతో కూడిన సన్నద్‌ (పత్రం లాంటిది) గల్లంతయినందున కొత్తది పంపాలంటూ నాటి గాంధారి తాలూకాలో (ప్రస్తుత మంచిర్యాల జిల్లా పరిధి)ని ముత్యంపల్లికి చెందిన కోవ బాబూరావు, కోవ సోముజు అనే గోండు మొకాశీలు... స్థానిక దేశ్‌ముఖ్‌లను కోరారు. దీంతో వారు 1871లో కొత్త సన్నద్‌ పంపారు. ప్రస్తుతం ఇది వారి వారసుల వద్దే ఉంది. తాజాగా ఈ సన్నద్‌ వెలుగు చూసింది. అందులో నాటి పన్నుల వివరాలు స్పష్టంగా ఉన్నాయి. 1824 నుంచి 1897 వరకు 3 పర్యాయాలు నాటి గోండు మొకాశీలు దేశ్‌ముఖ్‌ల నుంచి సన్నద్‌లు పొందినట్టు సమాచారం. 



ఈ శాసనం ‘స్వస్తిశ్రీ జెయాభ్యుదయ శాలివాహన శక వర్సం బులుగు రక్తాక్షి నామ సంవత్సరం మాఘ శుద్ధ గురువారం...’అన్న వాక్యాలతో మొదలైంది. అక్షరాలు తెలుగులో ఉన్నా.. శాసనం పైన ఉర్దూలో ఆమోద ముద్రలుగా కొన్ని వాక్యాలున్నాయి. వసూలు కాలేదనో, జనం ఇవ్వలేదనో కారణాలు చూపకుండా సకాలంలో సరిపడినంత పన్నులు చెల్లించి పుత్రపౌత్రాభివృద్ధితో వర్ధిల్లాలని శాసనంలో పేర్కొన్నారు. ఓ రాతి శాసనాన్ని పరిశీలించే క్రమంలో తనకు స్థానికులు ఈ శాసనసం జాడ తెలిపారని, వారి నుంచి దాని నకలు పొంది పరిశీలించినట్టు ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు ధ్యావనపల్లి సత్యనారాయణ ‘సాక్షి’కి వెల్లడించారు. మొకాశీల వారసుల వద్ద ఇప్పటికీ అసలు ప్రతి ఉందని తెలిపారు. తాను దాని నకలును మాత్రమే పరిశీలించినట్టు వివరించారు.



Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top