ప్రైవేటుతో మెరుగైన వాతావరణ అంచనాలు!


* రుతుపవనాల కచ్చిత అంచనా కష్టమే

* తుపానుల తీవ్రత పెరుగుదలకు కారణాలు తెలియవు

* కొలరాడో శాస్త్రవేత్త వెదర్‌హెడ్ 

* ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ


 

 సాక్షి, హైదరాబాద్: వాన రాకడ... ప్రాణం పోకడ తెలియదంటారుగానీ... ఈ కాలంలో కొంచెం అటుఇటుగానైనా వీటి అంచనా కట్టడం సాధ్యమే. అయితే వాన విషయంలో ఈ కొద్దిపాటి అస్పష్టతే దేశంలోని కోటానుకోట్ల రైతన్నలకు ప్రాణసంకటంగా మారుతోంది. అందుకే చినుకు ఎప్పుడు, ఎక్కడ, ఎంత మేరకు కురుస్తుందో  కచ్చితంగా తెలియాలంటే ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించాలంటున్నారు ఎలిజబెత్ వెదర్‌హెడ్.

 

 కొలరాడో విశ్వవిద్యాలయంలో వాతావరణంపై పరిశోధనలు చేస్తున్న ఈ శాస్త్రవేత్త ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ‘సాక్షి’ వాతావరణ అంచనాలు మొదలుకొని...భూతాపోన్నతి ప్రభావాల వరకూ పలు అంశాలపై ఎలిజబెత్ వెదర్‌హెడ్‌తో ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

 

  భూతాపోన్నతి ఫలితంగా సముద్రాల ఉపరి తల ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో నీటి ఆవిరి, గాలిలో తేమశాతం ఎక్కువవుతున్నాయి. దీనివల్ల రుతుపవనాల అంచనాలు కూడా గతితప్పుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.

 

  అమెరికాలో వాతావరణ అంచనాలను తెలిపే అప్లికేషన్లకు జీమెయిల్, ఫేస్‌బుక్‌లకు మించిన ఆదరణ ఉంది. అందుకే పదుల సంఖ్యలో ప్రైవేట్ కంపెనీలు కచ్చితత్వంతో పనిచేస్తున్నాయి. భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితి వస్తే బాగుంటుంది.

   సూర్యుడి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ప్రభావం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉండదన్నది నా నమ్మిక.

  గత కొన్నేళ్లలో భారత్‌తోపాటు, అమెరికా కూడా కనీవినీ ఎరుగని స్థాయి తుపానులు, ఉప్పెనలను చవిచూశాయి. కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియదు. సముద్రపు ఆవిరి, నేలపై నుంచి పైకి ఎగసే వేడి గాలులు కలిసే చోటు (బౌండరీ లేయర్)లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని మాత్రం గుర్తించగలిగాం. భూమి నుంచి కిలోమీటర్ ఎత్తువరకూ ఉండే ఈ ప్రాంతంలోని మార్పులను అధ్యయనం చేస్తే కారణాలు తెలియవచ్చు.

 

  అమెరికా ఇప్పటికే వాతావరణంలోకి చేరవేసిన కార్బన్ ఉద్గారాలను తొలగించడం కష్టసాధ్యమైనపని. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక అభివృద్ధిని పణంగా పెట్టి ఉద్గారాలను తగ్గించుకోవాలనడం సరికాదు. భూతాపోన్నతి విషయంలో ఆయా దేశాలు తమ అవసరాలను తగ్గట్టుగా పరిష్కార మార్గాలు వెతుక్కోవాల్సి ఉంటుంది.

 

  రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే క్లోరోఫ్లూరో కార్బన్స్ వాడకానికి ఫుల్‌స్టాప్ పెట్టడంవల్ల ఓజోన్ పొర పరిస్థితి మెరుగుపడింది. అయితే ఈ రసాయనాల స్థానంలో అందుబాటులోకి రాను న్న హైడ్రోజనేటెడ్ ఫ్లోరోకార్బన్స్‌తో భూతాపోన్నతి ప్రమాదం పెరిగే అవకాశమున్నది కూడా నిష్టుర సత్యం. ఓజోన్ పొరను రక్షించుకుంటూనే భూతాపోన్నతి తీవ్రత పెరక్కుండా చూసుకునేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top