అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం


 'సాక్షి' ఫోన్ ఇన్ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రంగంలోకి దించి సమూలంగా కూల్చివేస్తామని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు హెచ్చరించారు. అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా నిరోధించడంతో పాటు ఆయా ప్లాట్లపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేకుండా స్తంభింపజేస్తామని కమిషనర్ ప్రకటించారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ల కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొనే విషయంలో ప్రజలకు తలెత్తుతోన్న వివిధ సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆదివారం ప్రత్యేకంగా ‘ఫోన్ ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. 



ఈ సందర్భంగా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు నేరుగా హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. లేఅవుట్లకు అనుమతిచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదని, హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ఏర్పాటైన వాటిని అక్రమ లేఅవుట్లుగా పరిగణిస్తామని చిరంజీవులు తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు ఇష్టం వచ్చినట్లు అనుమతులివ్వకుండా పంచాయతీ కమిషనర్ ద్వారా ఉత్తర్వులు ఇప్పిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను తొలగించేందుకు ప్రత్యేకంగా 4 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. తొలుత చౌటుప్పల్ ప్రాంతంపై దృష్టి సారించామని, ఇక్కడ లెక్కకు మించి ఉన్న అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.



మహానగర పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ మేరకు అక్రమాలను సరిదిద్దేందుకు నవంబర్ 2న ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్‌ల ద్వారా రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పిస్తూ జీవో నెం.151 విడుదల చేసిందన్నారు. క్రమబద్ధీకరణ రుసుం కూడా చాలా తక్కువగా ఉందని.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిసెంబర్ 31తో గడువు ముగియనున్నందున సకాలంలో స్పందించాలని కోరారు. అయితే... నిబంధనలకు లోబడి ఉన్న వాటినే క్రమబద్ధీకరిస్తాం తప్ప చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలు, లేఅవుట్లను అనుమతించమని స్పష్టం చేశారు.



 డాక్యుమెంట్లు లేకపోయినా...

 హెచ్‌ఎండీఏకు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి, తగిన డాక్యుమెంట్లు లేకపోయినా ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ల కింద దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు తమ సిబ్బంది వచ్చినప్పుడు వాటిని అందిస్తే సరిపోతుందన్నారు. ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు సేల్‌డీడ్, బిల్డింగ్ ప్లాన్ వంటివి సమర్పిస్తే మిగతా వాటిని ఆయా విభాగాల నుంచి తామే తెప్పిస్తామని వివరించారు. ముఖ్యంగా 18 మీటర్ల ఎత్తు (5 అంతస్తుల) వరకు ఉండే భవనాలకు ఫైర్, ఎయిర్‌పోర్ట్ అథార్టీ అనుమతులు అవసరం లేదని ఆపైన నిర్మించే వాటికి విధిగా ఆయా విభాగాల నుంచి ఎన్‌వోసీ లు తీసుకురావాలని స్పష్టం చేశారు.



ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే తరుణంలో మీ మొబైల్ నంబర్ ఇస్తే వెంటనే ఓ పాస్‌వర్డ్ జనరేట్ అవుతుందని, దీని ఆధారంగా మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లోనే చూసుకోవచ్చన్నారు. దళారుల మాటలు నమ్మొద్దని, ఇన్‌స్పెక్షన్ అధికారులు మీకు ఫోన్ చేసి వస్తారు.. మీ కళ్లముందే కొలతలు తీసుకొని చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని వెల్లడిస్తారని తెలిపారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే సమయంలో మీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇతరులకు ఇవ్వకుండా మీరే ఆపరేట్ చేయాలని, అవి లేనివారు మండల కేంద్రంలోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఇచ్చే ఓచర్‌ను తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా వచ్చిన దరఖాస్తులను 6 నెలల్లోగా పరిష్కరించి అనుమతి పత్రాలు జారీ చేస్తామని కమిషనర్ వెల్లడించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top