1920 - 1389 = 531

1920 - 1389 = 531


ఇవీ నగరంలో మిగిలిన చెరువులు.. వీటిల్లోనూ 50 శాతానికి పైగా కబ్జాలోనే..

 

 మహానగరంలో అడుగడుగునా చెరువుల విధ్వంసం

కబ్జాలు, ఆక్రమణలు, అభివృద్ధి పేరుతో మాయం

జలవనరులు మింగడంతో మహానగరానికి కన్నీటి దౌర్భాగ్యం

వేలాది ఎకరాల వ్యవసాయ, ద్రాక్ష తోటలు కనుమరుగు

103 రకాల పక్షి జాతులు దూరం.. మత్స్యకారుల వలసలు

చెరువులను చెరబట్టడంతో నేడు వరదల్లో మునుగుతున్న నగరం

 

ఇదీ చెరువుల లెక్క



(హుడా పరిధిలో... ఓఆర్‌ఆర్ లోపల)

     1982                920

     2012                545

 

 

మాయమైన చెరువులు మొత్తం - 375



5 హెక్టార్లలోపు    323

5-10 హెక్టార్ల లోపు    52

 

తగ్గిన వ్యవసాయం



1970లో    80 వేల ఎకరాలు

2012లో    15 వేల ఎకరాలు

 

రైతుల సంఖ్య



1970లో    49 వేలు

2012లో    7 వేలు

 

నీటి వనరుల ప్రాంతం తగ్గుదల

సంవత్సరం    శాతం

1982        21.53

2012        17.02

 

 

భాగ్యనగరం... రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతూ నీటి లభ్యత కరువై అల్లాడుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, గండిపేట చెరువులు అందిస్తున్న నీరు ఏమాత్రం సరిపోని పరిస్థితి. వందల సంవత్సరాలుగా రాజధాని నగరంగా ఉన్న హైదరాబాద్‌కు గతంలో ఈ దుస్థితి లేదు. స్వాతంత్య్రం వచ్చే నాటికి వందలాది చెరువులు తాగు, సాగునీటిని అందిస్తుండేవి. నేడు ఆ చెరువులు కుంచించుకుపోయాయి. కొన్ని కనుమరుగయ్యాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భూ కబ్జాల్లో భాగంగా అన్యాక్రాంతం అయిన చెరువుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే తమ్మిడి చెరువు, శేరిలింగపల్లిలోని కొన్ని చెరువుల ఆక్రమణను జీహెచ్‌ఎంసీ లెక్క తేల్చింది.



ఈ నేపథ్యంలో చెరువుల ఆక్రమణపై నేటి ‘సిటీ ఫోకస్’...

 

వనం దుర్గాప్రసాద్, సాక్షి -సిటీప్లస్ నాడు...



1920 చెరువులు, తటాకాలు.. అనాడు మహానగరంలో ఉన్న జలవనరులివి. ఇది చారిత్రక ఆధారం... ఎటు చూసినా పుష్కలంగా నీళ్లు.. పది గజాలు తవ్వితేనే తన్ను కొచ్చే జలాలు. పచ్చని పైర్లతో స్వాగతం పలికే శివార్లు.. బస్తాలకొద్దీ ఆహార ధాన్యాలు, బుట్టలకొద్దీ మధుర ఫలాలు, టన్నులకొద్దీ కూరగాయలు.. ఇతర పట్టణాలకు సైతం సరఫరా చేసేంత పాడి.. వేసవి తాపం దాదాపు తెలియదనే చెప్పాలి. చెరువుల శిఖాలు పంట పొలాలయ్యాయి. 1970 వరకు మహానగరాన్ని అనుకుని 80 వేల ఎకరాల్లో వ్యవసాయం జరిగేది. వేల ఎకరాల్లో ద్రాక్ష తోటలు ఉండేవి. 103 రకాల పక్షి జాతులు  ఉండేవి.



ఇదీ నేపథ్యం



దీనికో చరిత్ర ఉంది. నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే మూసీ 1908 సెప్టెంబర్ 28న శివాలెత్తింది. వరదతో ముంచెత్తింది. ఆ రోజు నగరంలో 17 అంగుళాల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు కొట్టుకుపోయాయి. 150 మంది చనిపోయారు. అపార ఆస్తినష్టం జరిగింది. ఆ విపత్తు నవాబును కదిలించింది. వరదలను కట్టడి చేసేందుకు నిపుణుల సలహా మేరకు చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. హుస్సేన్‌సాగర్, మీర్‌ఆలం, అఫ్జల్‌సాగర్, జల్‌పల్లి,  మా- సాహెబా ట్యాంక్ (మాసబ్‌ట్యాంక్), తలాబ్‌కట్ట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్... ఇలాంటి చెరువుల నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. నాడు పచ్చని శోభతో అలరారిన తటాకాలు ఇప్పుడు చూస్తే రోత పుట్టే మురుగుతో నిండిపోయాయి.  మూసీలోకి రోజూ 350 మిలియన్ లీటర్ల వ్యర్థ పదార్థాలను పంపుతున్నారు.



బతుకమ్మ ఏమైంది?



తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ పేరుతో వెలసిన బతుకమ్మ చెరువు ‘ఛే’ నంబర్ బస్తీకి చేరువలో ఉండేది. నిజాం కాలంలో కట్టిన ఈ చెరువులో అప్పట్లో గుర్రాలను కడిగేవాళ్లు. 27 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో బతుకమ్మల నిమజ్జనం వేడుకగా ఉండేది. కానీ ఇప్పుడు దీని ఆనవాళ్లే లేవు.



ఏమిటీ ‘దుర్గం’ధం?



400 ఏళ్ల చరిత్ర కలిగిన 100 ఎకరాల దుర్గం చెరువు దుస్థితి ఆందోళన కలిగిస్తోంది. కబ్జారాయుళ్లు దీన్ని సగం కాజేశారు. మిగతా సగాన్ని విషతుల్యం చేశారు. ఈ ప్రాంతంలో 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. అక్కడ శాశ్వత కట్టడాలు కట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించినా ఎవరూ పట్టించుకోలేదు.



రామమ్మ కుంట సంగతేంటి?



 ప్రస్తుతం ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఒకప్పుడు రామమ్మకుంట ఉండేది. ఇది మత్స్యకారులకు, రైతులకు ఒకప్పుడు ప్రధానవనరు. ఇప్పుడిక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్టార్ హోటళ్లు వెలిశాయి. మణికొండలోని 30 ఎకరాల ఎల్లమ్మ చెరువుదీ ఇదే పరిస్థితి. సగం కబ్జా చేసిన ఈ చెరువు స్థలంలో అపార్టుమెంట్లు వెలిశాయి. గతంలో ఇక్కడ 12 వేల ఎకరాల్లో రైతులు సాగు చేసేవారు.



శామీర్‌పేట ఏమైంది?



శామీర్‌పేటలో చెరువులన్నీ నామ రూపాల్లేకుండా పోయాయి. బూరుగు చెరువును పూడ్చేసి రిసార్ట్ కట్టారు. మేడ్చల్ పరిధిలో 247 చెరువులు, కుంటలు ఉండగా 17 చెరువులు కబ్జా అయ్యా యి. బోడుప్పల్, పీర్జాదిగూడ పుల్‌చర్‌కుంట, మేడిపల్లి చెరువులు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. సరూర్‌నగర్ మండలంలోని పార్క్ ఏరియా చెరువు 70 శాతం ఆక్రమించారు. ఇబ్రహీంపట్నం  నియో జకవర్గంలో దాదాపు 9 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. వికారాబాద్ పట్టణంలోని శివసాగర్ చెరువు విస్తీర్ణం 211.32 ఎకరాలు. ఇందులో 80 ఎకరాలు ఆక్రమణకు గురైంది.



ఒకటా... రెండా...?



ఇప్పటికీ 375 చెరువుల జాడ తెలియడం లేదు. పర్యావరణ వేత్తల ఒత్తిడి, న్యాయస్థానాల ఆగ్రహంతో పైపై లెక్కలు మొదలు పెట్టిన జీహెచ్‌ఎంసీ సరైన వివరాలు సేకరించలేదు. 30 ఏళ్ల కిందట 920 చెరువులున్నట్టు లెక్కలున్నాయి. కానీ 2012 నాటికి వీటి సంఖ్య 531కి తగ్గింది. జీహెచ్‌ఎంసీ, హుడా, నీటి పారుదల, రెవెన్యూ విభాగాల లెక్కలకు పొంతన కుదరడం లేదు. మాయమైన చెరువుల్లో 5 హెక్టార్లలోపు ఉన్నవే ఎక్కువ. ఇలాంటి చెరువులు  1982 నుంచి 2012 మధ్య 375 కనుమరుగయ్యాయి.



సర్వేలో నిజాలు



కబ్జాకు గురవుతున్న చెరువులపై స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. కోర్టులనూ ఆశ్రయించాయి. దీనిపై హైకోర్టు, సుప్రీం కోర్టులూ స్పందించాయి. చెరువుల లెక్క తేల్చాలని లోకాయుక్త, కోర్టులూ ఆదేశించాయి. ఈ నేపథ్యంలో హుడా అధికారులు మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో 2,304 చెరువులున్నట్టు నిగ్గు తేల్చారు.  తొలిదశలో 501 చెరువులపై సర్వే చేయించారు. ‘గ్రేటర్’ పరిధిలో 176 చెరువులున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో 128 ఉన్నట్టు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ అవతల హుడా  పరిధిలో 325 చెరువులున్నాయని పంచాయితీరాజ్ శాఖ చెబుతోంది. కానీ ఇందులో 204 మాత్రమే గుర్తించారు. ఈ గందరగోళ పరిస్థితిలో పూర్తిస్థాయి సర్వే, ఎఫ్‌టీఎల్(ఫుల్‌ట్యాంక్ లెవల్) బాధ్యతను ఆర్వీ కన్సల్టెన్సీకి ఇచ్చారు. అయితే ఈ సంస్థకు నిజాం నాటి చిత్రాలను అందించలేదు. సర్వే ఆఫ్ ఇండియా పాయింట్స్‌ను చెప్పలేదు. దీంతో ఇప్పుడున్న ఎఫ్‌టీఎల్(పూర్తిస్థాయి నీటిమట్టం)నే గుర్తించాలని చూస్తున్నారు. ఇది వివాదాస్పదమైంది. దీంతో ఈ సర్వే ముందుకు సాగడం లేదు. మరోవైపు ఎన్జీఆర్‌ఐ (నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్) శాటిలైట్ సమాచారంతో 30 ఏళ్ల నాటి చిత్రాలను క్రోడీకరించి, సర్వే నివేదికను జీహెచ్‌ఎంసీకి అందజేసింది. క్షేత్రస్థాయి సర్వేలు జరిగితే తప్ప ఎన్ని చెరువులున్నాయనేది నిర్ధారించడం కష్టమే.



కాపాడుకోవడం ఎలా..?



 కబ్జాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్‌కు నీటి వనరులు కష్టమనేది నిపుణుల అభిప్రాయం. ఆక్రమణలను తొలగించడంతో పాటు, ఉన్న చెరువులకు రక్షణ వలయం ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. చెరువుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.



http://img.sakshi.net/images/cms/2014-06/61403983887_Unknown.jpg

 

కాపాడకపోతే కష్టాలే




చెరువులు మాయమవ్వడం సాధారణ విషయం కాదు. దీనివల్ల పదేళ్ళ కాలంలో నగర వాతావరణంలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. పర్యావరణ వేడి 1.2 డిగ్రీలు పెరగడం ప్రమాదాన్ని సూచిస్తోంది. దీనివల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. భూగర్భ నీటి మట్టం ఏటా 10 అడుగులు తగ్గుతోంది. ఉన్న చెరువులనైనా కాపాడాలి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తరహాలో ప్రత్యేక అథారిటీని నియమించాలి. అప్పుడే చెరువులను కాపాడుకోగలం.    

   

 -డాక్టర్ ఎంజే నందర్,  (సీనియర్ శాస్త్రవేత్త, ఎన్జీఆర్‌ఐ)

 

 అవగాహన కల్పించాలి



 చెరువుల అవసరంపై అవగాహన కల్పించాలి. దీన్నో ఉద్యమంగా చేపట్టాలి. కొన్ని చెరువుల రికార్డులే దొరకడం లేదు. పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) నిర్థారణ బాధ్యతను ఓ సర్వే సంస్థకు అప్పగించారు. అయితే వాళ్ళకు అవసరమైన మ్యాప్‌లు ఇవ్వలేదు. 1970లో సర్వే ఆఫ్ ఇండియా చిత్రాలను బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయి. చెరువులకు ఫెన్సింగ్ వేసి, కాలుష్యం నుంచి రక్షించాలి. వీటిపై అధికారులు దృష్టి పెట్టాలి.

 

- వేదకుమార్ (సామాజిక వేత్త)

 

 నిజాలు తేల్చండి



 పూర్తిస్థాయి నీటిమట్టం గుర్తింపు (ఎఫ్‌టీఎల్) బాధ్యతను ఆర్వీ కన్సల్టెన్సీకి అప్పగించారు. వాళ్ళు ఇప్పుడున్న నీటిమట్టాన్నే వాస్తవమైనదిగా చెబుతున్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. చెరువుల ఆక్రమణ మరుగున పడే ప్రమాదం ఉంది. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ ద్వారానే నిర్ధారణ జరగాలి. దీంతో పాటు వర్షం నీటిని చెరువులకు పంపి, భద్రపరిచే ప్రక్రియ జరగాలి. దీనివల్ల చాలావరకూ భూగర్భ నీటి మట్టాన్ని పరిరక్షించుకోవచ్చు.

  

 - చక్రవర్తి  (సేవ్ అవర్ లేక్స్ సంస్థ సభ్యుడు)



http://img.sakshi.net/images/cms/2014-06/61403984011_Unknown.jpg

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top