ఏది నీటి చుక్కాని?

ఏది నీటి చుక్కాని?


నెలాఖరుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాలు ఖాళీ

వట్టిపోయిన మంజీర  ఈ నెల 29 నుంచి నిలిచిపోనున్న నీటి సేకరణ

గ్రేటర్ ప్రజలకు తప్పని కష్టాలు  


 

కుత్బుల్లాపూర్:  గ్రేటర్ శివార్లను నీటి కష్టాలు వేధిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి ఒడ్డున పడేసే చుక్కాని కోసం శివారు జనాలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మహా నగర దాహార్తిని తీరుస్తున్న సింగూరు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు ఈ నెలాఖరుకు పూర్తిగా వట్టిపోనున్నాయి. ప్రస్తుతం మంజీర జలాశయం నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో శివారు మున్సిపల్ సర్కిళ్లలో తీవ్ర ఎద్దడి నెలకొంది. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో మంగళవారం నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో వందలాది కాలనీలు, బస్తీలు తీవ్ర దాహార్తితో విలవిల్లాడాయి. సింగూరు, మంజీర జలశయాల ద్వారా సరఫరా చేసే నీటిలో సగానికి కోత విధించారు. ఎస్.ఆర్‌నగర్ , కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్లకు సరఫరా అవుతున్న నీటిలో 50 శాతం కోత పడింది. ప్రస్తుతం సింగూరు నుంచి తరలిస్తున్న 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వివిధ ప్రాంతాలకు పొదుపుగా (రేషన్) సరఫరా చేస్తుండడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. డిసెంబరు  రెండో వారంలో సరఫరా  చేసే 85 ఎంజీడీల గోదావరి జలాలతో నగర దాహార్తిని తీరుస్తామని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.



కుత్బుల్లాపూర్‌లో యుద్ధాలు   

కుత్బుల్లాపూర్ సర్కిల్‌కు వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లుజలమండలి జీఎం ప్రవీణ్‌కుమార్ ప్రకటించడం కలకలం రేపింది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, అపార్టుమెంట్లు, కాలనీలు, మురికివాడలకు మంగళ వారం 36 ట్యాంకర్లతో అరకొరగా నీటి సరఫరా చేశారు. దీంతో ఈ సర్కిల్‌లోని వివిధ ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద నీటి కోసం స్థానికులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రసూన నగర్‌లో గొడవ చోటు చేసుకోగా ఓ మహిళ ముక్కు పగిలి గాయమైంది. మాణిక్యనగర్‌లోని ప్రతి వీధిలో జనం ట్యాంకర్ల కోసం పడిగాపులు కాశారు. వాణీ నగర్, వసంత కెమికల్స్, షాపూర్ నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో రిజర్వాయర్ల వద్ద కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు క్యూ కట్టి ట్యాంకర్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. మొత్తం సర్కిల్‌లో 58 వేలకు పైగా ఉన్న కనెక్షన్లకు వారం రోజులుగా నీళ్లు లేవు. చింతల్ డివిజన్‌కు 18 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా కేవలం 8 ఎంజీడీలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవ సరఫరా 3 ఎంజీడీలకు మించి లేకపోవడం గమనార్హం.



ముందుకు సాగని రిజర్వాయర్ నిర్మాణం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మార్చి 2న ఇక్కడ 5 ఎంఎల్ రిజర్వాయర్‌కు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఫిబ్రవరి 21న టెండర్లు పిలిచారు. రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7 కోట్ల వ్యయమే అవుతుండగా... మరో రూ.3 కోట్ల మేరకు అంచనాలు పెరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టెండర్లు రద్దు చేయడంతో రిజర్వాయర్ నిర్మాణం అటకెక్కింది.



నీటి కోసం ఆందోళనలు...

మంచినీటి ఎద్దడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ మంగళవారం వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ఆందోళన చేపట్టారు. ఐడీపీఎల్ చౌరస్తా వద్ద ఆందోళన చేసి.. అక్కడి నుంచి ర్యాలీగా కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

 

గోదావరి జలాలతో కొరత తీరుస్తాం


 ప్రస్తుతం మంజీర జలాశయం నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సింగూరు నుంచి అరకొరగా సరఫరా అవుతోంది. ఈ నెలాఖరుకు ఇదీ నిలిచిపోనుంది. డిసెంబరు ద్వితీయ వారంలో నగరానికి తరలించనున్న 85 ఎంజీడీల నీటితో వివిధ ప్రాంతాల దాహార్తిని తీరుస్తాం.



 -విజయ్ కుమార్ రెడ్డి, జలమండలి

 ట్రాన్స్‌మిషన్ విభాగం సీజీఎం

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top