నిర్ణయం నేడే..


సాక్షి, సిటీబ్యూరో: ఎక్స్‌ప్రెస్‌వేలు.. ఎలివేటెడ్ కారిడార్లు.. మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు.. జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్లు. గత కొంతకాలంగా సుపరిచితమైన పేర్లు. విశ్వనగర నిర్మాణంలో భాగంగా వేల కోట్ల రూపాయలతో ఇలాంటి మార్గాలు నిర్మిస్తామని గత కొంతకాలంగా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, తొలుత ఎక్కడ మొదలు కానున్నాయి.. ఎప్పుడు ప్రారంభిస్తారు..?  అనే ఆసక్తి నగర ప్రజల్లో నెలకొంది. తొలిదశలో రూ. 1200 కోట్ల మేర పనులు చేపట్టాలని, రూ. 500 కోట్ల పనులకు టెండర్లు పిలవాలనుకున్నారు.



అనంతరం ఆ నిర్ణయం మారింది. ఇంతవరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన జరగలేదు. మరో నెలరోజుల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో కనీసం ఒక్క పనినైనా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం తొమ్మిది పనులకు గాను రూ. 1611 కోట్లు ఖర్చు కాగలదని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనాలు రూపొందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు దాదాపు నెలరోజుల క్రితమే సిద్ధమయ్యాయి. అయితే ఆ నివేదిక గడచిన మూడు వారాలుగా ఉన్నతాధికారుల పరిశీలన కోసం సచివాలయంలో ఉంది.



జీహెచ్‌ఎంసీలోని వివిధ అభివృద్ధి పనులపై శనివారం చీఫ్ సెక్రటరీ వద్ద సమీక్ష సమావేశం జరగనుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు రూపొందించిన ఈ ప్రాజెక్టులకు అవసరమైన మార్పుచేర్పులతో ఈ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి పరిపాలనా పరమైన అనుమతులు మంజూరుకాగానే పనులకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించాలనే యోచనలో జీహెచ్‌ఎంసీ అధికారులున్నారు. ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో ఫ్లై ఓవర్లు, జంక్షన్ అభివృది ్ధపనులు, మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఆ వివరాలు ‘సాక్షి’కి లభించాయి.

     

మొత్తం పనుల్లో కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు.. ఎల్‌బీనగర్, బైరామల్‌గూడల వద్ద పనులకే దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఖర్చు         చేయనున్నారు.

     మొదట్లో జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి సంపన్న ప్రాంతాల్లోనే రాచమార్గాల పనులు చేయాలని అధికారులు భావించినప్పటికీ, నగరంలోని నాలుగు దిక్కులా కనీసం ఒక్క మార్గమైనా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు అన్నివైపులా ఒక్కో పనైనా ఉండేలా మార్గాలను ఎంపిక చేశారు.

     జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ స్పైరల్  ఫ్లై ఓవర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆరులేన్లతో దీనిని ఏర్పాటు చేస్తారు.  కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లై  ఓవర్లను ఏర్పాటు చేసేందుకు తొలుత ప్రతిపాదించినప్పటికీ, అనంతరం ఒక జంక్షన్‌ను ఉపసంహరించుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top