‘పవర్స్‌’ కట్‌!

‘పవర్స్‌’ కట్‌!


‘కొర్రెముల’ ఘటనతో మేల్కొన్న ప్రభుత్వం

అనుమతి లేని నిర్మాణాలపై సీరియస్‌

శివార్లలో ఎక్కడికక్కడ చెక్‌ పెట్టేందుకు నిర్ణయం

కొర్రెములలో గ్రౌండ్‌ఫ్లోర్‌కూ హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి  

మిగతా ప్రాంతాల్లోనూ అక్రమాల నిగ్గుతేల్చే పనిలో విజిలెన్స్‌ కమిటీ




గర శివారు ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్‌లకు ఇక పూర్తిస్థాయిలో చెక్‌పడనుంది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొందరు అధికారుల చేతివాటంతో పుట్టుకొస్తున్న అక్రమ కట్టడాలను నిలువరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాటి అధికారాలకు కత్తెర వేయాలని భావిస్తోంది. కొర్రెముల గ్రామ పంచాయతీ పరిధిలో జీప్లస్‌2 దాటి భవనాలు నిర్మించినా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడంతో ఆ పంచాయతీ ‘పవర్స్‌’ కట్‌ చేసింది.



సిటీబ్యూరో: ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల గ్రామ పంచాయతీ పరిధిలోనే కాకుండా శివారు ప్రాంతాల్లోని చాలా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. విజిలెన్స్‌ ద్వారా ఆ లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండికొడుతున్న ఈ అక్రమాలు భారీస్థాయిలో ఉన్నాయని తేలితే...కొర్రెముల గ్రామ పంచాయతీ మాదిరిగానే మిగతావాటి అధికారాలకు కూడా కత్తెరవేసి...హెచ్‌ఎండీఏకే పూర్తి అనుమతులు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.   



ఒక్క అంతస్తు కట్టాలన్న హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి...

ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు కట్టినా...ఒక అంతస్తు భవనం నిర్మించినా ఇక నుంచి హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకోవాల్సిందే. ఇందుకు సంబంధించి నేడో, రేపో  కొర్రెముల గ్రామ పంచాయతీకి ప్రభుత్వం పంపిన ఉత్తర్వులను పంపి ఆ అధికారాలను హెచ్‌ఎండీఏ ఆధీనంలోకి తీసుకోనున్నారు. కొర్రెముల గ్రామ పంచాయతీ పరిధిలో ఇష్టారీతిన వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను నియంత్రించని అధికారుల వైఫల్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుండటంతో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి అధికారాలకు కత్తెరపెట్టింది. 1991లో 408 జీవో ద్వారా కొర్రెముల గ్రామపంచాయతీకి సంక్రమించిన «అధికారాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇప్పటివరకు జీప్లస్‌టూ దాటితేనే హెచ్‌ఎండీఏ పర్మిషన్‌ తీసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో కొర్రెముల గ్రామ పంచాయతీ పరిధిలో ఇక నుంచి ఏ బిల్డింగ్‌ పర్మిషన్‌ కావాలన్న హెచ్‌ఎండీఏకు భవన యజమానులు దరఖాస్తు చేసుకోవాల్సిందే.   



క్రమంగా మిగతా పంచాయతీలకు...

కొర్రెముల గ్రామ పంచాయతీ అధికారాలకు కత్తెర వేసి ప్రభుత్వం మిగతా గ్రామ పంచాయతీలకు కూడా హెచ్చరికలు పంపినట్టయింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 849 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని, ఇష్టారీతిన అక్రమ భవనాలు వెలుస్తుంటే అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తే కొర్రెముల గ్రామ పంచాయతీ మాదిరిగానే మిగతా గ్రామ పంచాయతీల అధికారాలు కూడా కత్తిరిస్తామని హెచ్చరిస్తున్నారు. హెచ్‌ఎండీఏలో అమలవుతున్న డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌) సేవల ద్వారా నెలరోజుల్లోనే భవన నిర్మాణ పనులకు అనుమతులు లభిస్తుండటంతోపాటు పారదర్శకత, పనుల్లో వేగం అందుకోవడంతో కొర్రెముల గ్రామ పంచాయతీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top