మౌనంగానే ఎదిగాడు

మౌనంగానే ఎదిగాడు


‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది...’ అనే పాటలోని వాక్యాన్ని అక్షరాలా నిజం చేశాడు ఆ యువకుడు. అతడు పుట్టిన మూడేళ్లకే తల్లి కన్నుమూసింది. వేలు పట్టి నడిపిస్తాడనుకున్న నాన్న ఐదో ఏటే దూరమయ్యాడు. ఆసరాగా ఉంటారనుకున్న అన్నలూ మద్యానికి బానిసలై కాలం చేశారు.. ఓ బాలుడికి కళ్లముందే ‘నా’ అనుకున్న వాళ్లందరూ దూరమయ్యారు.



బంధువులు చేరదీయలేదు.. తినడానికి తిండి లేదు.. ఒంటిమీద సరైన దుస్తులూ లేవు.. పనిచేసి సంపాదించే వయసూ కాదు.. పట్టించుకునే దిక్కులేదు. అలాంటి స్థితి నుంచి ఆ కుర్రాడు కష్టాలకు ఎదురీదాడు. దారి తెలియని వయసులోనే తనకు తానే మార్గనిర్దేశం చేసుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదివే స్థాయికి ఎదిగాడు.  కాలం చేసిన గాయాలను తట్టుకుని నిలిచిన ఆ యువకుడి పేరు వెంకటేశ్ చౌహాన్. ఇటీవల రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికై ఔరా అనిపించాడు. బుధవారం జరగనున్న హెచ్‌సీయూ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టా అందుకోనున్న వెంకటేశ్‌పై ప్రత్యేక కథనం...

 

నల్గొండ జిల్లా కోదాడ మండలం కూచిపూడి తండాలో 1989లో  వెంకటేశ్ చౌహాన్ జన్మించాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, రక్తం పంచుకు పుట్టిన అన్నలను కోల్పోయాడు. దీంతో కాలమే వెంకటేశ్‌ను చేరదీసింది. సమాజమే బతుకు పాఠాలు నేర్పింది. ఐదో తరగతి వరకు కూచిపూడి తండా, రామాపురంలో చదువుకున్నాడు. ఆరు నుంచి ఇంటర్ వరకు కోదాడలో విద్యాభ్యాసం సాగింది. 8వ తరగతిలో ఉండగా చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆకలితో ఉన్న వెంకటేశ్ కోదాడ సమీపంలో ఉన్న అరుణాచలం ట్రాన్స్‌పోర్టు వద్ద నిల్చొని ఓ లారీని ఆపాడు. నన్ను పనిలోకి తీసుకోండన్నా, ఆకలిగా ఉందంటూ అడగడంతో వారు కాదనలేక పోయారు.

 

క్లీనర్ నుంచి పీహెచ్‌డీ వరకు..

వెంకటేశ్ రాత్రంతా లారీ క్లీనర్‌గా పనిచేస్తూ, ఉదయం పాఠశాలకు వెళ్లే వాడు. 9వ తరగతిలో కోదాడలోని ఓ హోటల్‌లో పాత్రలను కడిగే పనికి కుదిరాడు. అలా సంవత్సరం నెట్టుకొచ్చాడు. 10వ తరగతి నుండి ఇంటర్ దాకా ఎస్‌టీడీ బూత్ బాయ్‌గా, పండ్లు అమ్మే వ్యక్తిగా పనిచేస్తూ వచ్చాడు. మిత్రుల సహకారంతో డిగ్రీ కోసం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో సీటు సంపాదించాడు. ఉదయం తరగతులు వినటం రాత్రి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం చేసేవాడు. ఇలా పనులు చేయగా వచ్చిన డబ్బుతోనే జీవన ప్రయాణం సాగించేవాడు. అయితే ఏనాడు చదువును అశ్రద్ద చేయలేదు. ప్రతినిత్యం బతుకు పోరాటంలో ఎదుర్కొంటున్న సమస్యల ముందు చదువు ఎప్పుడూ కష్టమనిపించలేదు. చిన్ననాటి నుంచీ ప్రథమ శ్రేణిలోనే ఉత్తర్ణుడవుతూ వచ్చాడు.

 

ప్రొఫెసర్ సహకారంతో..

ఓ సెమినార్‌లో ఉపన్యాసం ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ  అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సూర్య ధనుంజయ్‌ని కలిసి తన పరిస్థితిని వివరించాడు. చలించిన ఆ ప్రొఫెసర్ దుస్తులు, పుస్తకాలు ఇచ్చి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సిద్దం చేశారు. దాంతో వెనుతిరగకుండా 2010లో హెచ్‌సీయూ ఎంఏ తెలుగులో సీటు సాధించి కృతజ్ఞత చాటుకున్నాడు. పీజీ పూర్తికాగానే రీసెర్చ్ ఫెలోషిప్ (ఆర్‌జీఎన్‌ఎఫ్)కు ఎంపికై, ఎంఫిల్ అదే యూనివర్సిటీలో పూర్తి చేశాడు. హెచ్‌సీయూ ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు పర్యవేక్షణలో ‘మత్తడి కవిత సంకలనం’పై పరిశోధన పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ ద్వితీయ సంవత్సర విద్యార్థిగా కొనసాగుతున్నాడు.



నేడు పట్టా ప్రదానం

‘మత్తడి కవిత సంకలనం’పై చేసిన పరిశోధనకుగాను వెంకటేశ్‌కు సెంట్రల్ యూనివర్సిటీ పట్టాను అందించనుంది. ఇన్నాళ్లుగా తాను పడ్డ కష్టాలను పట్టా అందుకుని మరిచిపోతానని వెంకటేశ్ చెబుతున్నాడు. అనాథనని బాధ పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే.. కష్టాలు కూడా తలవంచి విజయాన్ని అందిస్తుందని వెంకటేశ్ నిరూపించాడు. చదువులోనే కాక ఉత్తమ మిమిక్రీ కళాకారుడిగా, గాయకుడిగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చాడు. భవిష్యత్తులో అనాథాశ్రమం స్థాపించి తనలాంటి వారికి సాయపడాలన్నదే తన లక్ష్యమని వెంకటేశ్ చెమర్చిన కళ్లతో తన గతాన్ని.. మనోగతాన్ని చెప్పుకొచ్చాడు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top