వీసీల నియామకాలు చెల్లవు

వీసీల నియామకాలు చెల్లవు - Sakshi


* 28, 29, 38, 1 నంబర్ జీవోలను కొట్టివేసిన హైకోర్టు

* పభుత్వ చర్య చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా..

* యూజీసీ నిబంధనల మేరకే వీసీల నియామకాలు జరగాలి

* చాన్స్‌లర్లుగా డాక్టరేట్ ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వాలని సూచన


సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాలకు చాన్సలర్లు, వైస్ చాన్స్‌లర్ల (వీసీల) నియామకం అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 28, 29, 38, 1 నంబర్ జీవోలను కొట్టివేసింది. ఇవన్నీ రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధమని.. వాటి ప్రకారం జరిగిన నియామకాలేవైనా రద్దయినట్లేనని స్పష్టం చేసింది.



యూజీసీ నిబంధనల మేరకే వీసీల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అయితే అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలును నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

 

ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో..

యూనివర్సిటీలకు ప్రభుత్వమే చాన్స్‌లర్లను నియమించేందుకు, గవర్నర్‌తో నిమిత్తం లేకుండా వీసీలను నియమించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం 28, 29 నంబర్ జీవోలను జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు వీసీల అర్హతలను మార్పు చేస్తూ జీవో 38, యూజీసీ పేస్కేళ్లను 2014, జూన్ 2 నుంచి వర్తింపజేసుకుంటూ జీవో నం 1లను కూడా జారీ చేసింది.



ఈ జీవోలను, తర్వాత వాటి స్థానంలో తీసుకొచ్చిన చట్టాలను సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.మనోహర్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై గత వారం తుది విచారణ జరిపి, తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం.. గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రాజ్యాంగానికి, పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తన న్యాయ పరిధిని దాటి మరీ ఈ జీవోలు జారీ చేసిందని ఆక్షేపించింది. ఎటువంటి అర్హతలను నిర్దేశించకుండానే చాన్స్‌లర్ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించడాన్ని తప్పుబట్టింది. వీసీల నియామక అర్హతలు కూడా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.



2010 యూజీసీ నిబంధనల మేరకే వీసీల నియామకాలను చేపట్టాలని ఆదేశించింది. అటు ప్రజా జీవితం లో, ఇటు విద్యా రంగంలో పేరు పొందిన వారిని నియమించాలని.. అందులోనూ డాక్టరేట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు, తమ ఆదేశాలకు అనుగుణంగా వీసీలను నియమించాలని సూచించింది.



ఈ వ్యాజ్యాలపై విచారణ పెండింగ్‌లో ఉండగా.. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఏవైనా నియామకాలు జరిగి ఉంటే అవి రద్దవుతాయని పేర్కొంటూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును అధ్యయనం చేసి తగిన విధంగా స్పందించేందుకు వీలుగా తీర్పు అమలును వాయిదా వేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన ధర్మాసనం తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలుపుదల చేసింది.

 

నేడు సీఎం సమీక్ష

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కొత్తగా నియమితులైన వీసీలు, సంబంధిత మంత్రులు, కార్యదర్శులు ఇందులో పాల్గొననున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top