అడ్డంగా దొరికి అవాకులా

అడ్డంగా దొరికి అవాకులా - Sakshi


- ఈడీ తాత్కాలిక ఎటాచ్‌పై పెడర్థాలు తీస్తారా..

- బాబు అండ్‌కో విషప్రచారంపై వాసిరెడ్డి పద్మ ఫైర్

- ‘ఓటుకు కోట్లు’లో చంద్రబాబు దొరికిపోవడం నిజం కాదా?

- రాజధాని, సదావర్తి భూములపై విచారణకు నిలబడే దమ్ముందా..

- అంతిమ విజయం న్యాయానిదే.. అదే జగన్ ధీమా...

- న్యాయస్థానాలపై మాకు అచంచల విశ్వాసముంది..

 

 సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు ... ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొనుగోలు చేస్తూ దోషిగా నిలబడింది చంద్రబాబు ... రాజధాని భూములతోపాటు, దేవాలయాలు, సత్రాల భూముల్లో అవినీతికి పాల్పడుతూ కన్నంలో చిక్కిన దొంగ .. అలాంటి చంద్రబాబు మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడమంటే దొంగే దొంగ, దొంగ అని అరిచినట్లుంది’’ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. రెండేళ్లలో లక్షన్నరకోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వంపై మా పార్టీ సాక్ష్యాలతో సహా ఓ పుస్తకాన్ని ప్రచురిస్తే విచారణకు నిలబడాల్సింది పోయి.. అనుకూల మీడియా సాయంతో తమ పార్టీపై దుష్ర్పచారానికి దిగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్) బుధవారం రూ 750 కోట్ల విలువ చేసే ఆస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేసిన అంశంపై వచ్చిన వార్తలు, టీడీపీ చేస్తున్న దుష్ర్పచారంపై ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా స్పందించారు.



 ఎటాచ్‌మెంట్ అంటే స్వాధీనం కాదు...

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ ఎటాచ్‌మెంట్ చేయడాన్ని టీడీపీ భూతద్దంలో చూపిస్తూ విషప్రచారం చేస్తోందని, ఎటాచ్‌మెంట్ చేసినంత మాత్రాన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కానే కాదని పద్మ అన్నారు. ఈడీ ఎటాచ్‌మెంట్ చేయడం అనేది సీబీఐ ఇప్పటికే జగన్‌పై ఉన్న కేసుల్లో దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా జరిగిన ప్రక్రియే  తప్ప మరొకటి కాదన్నారు. ఇంత మాత్రానికే జగన్ జైలుకు వెళతారని, నేరం నిర్థారణ అయిందని, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం మూతపడుతుందని... టీడీపీ నేతలు చేస్తున్న దాడి గర్హనీయమని ఆమె అన్నారు. న్యాయస్థానాలపై జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని, అంతిమంగా న్యాయమే విజయం సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారని, అందుకే ధీమాగా పార్టీని నడుపుతున్నారని పద్మ పేర్కొన్నారు. టీడీపీ చేస్తున్న విమర్శలు, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉంది కనుక తాను ఈ అంశాలపై వివరణ ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.



 టీడీపీ, కాంగ్రెస్ కుట్రతోనే కేసులు

 జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ వేసిన 11 చార్జిషీట్లపై విచారణ జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆమె అన్నారు.  వీటిపై విచారణ జరుగుతోందని ఆమె వివరించారు. రెండేళ్ల పరిపాలనలో ఏమీ చేయలేక పోయిన చంద్రబాబు తన వైఫల్యాలు, అవినీతి కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈడీ ఎటాచ్‌మెంట్‌ను సాకుగా చేసుకుని విమర్శిస్తున్నారని పద్మ అన్నారు.



 ముందుంది ముసళ్ల పండుగ

 గత ఐదేళ్లుగా జగన్‌పై సాగుతున్న కుట్రలు, కేసులు, సీబీఐ విచారణ అవన్నీ ముగిసిపోయిన అధ్యాయమని పద్మ అన్నారు. ఇపుడు ఇక చంద్రబాబుఅవినీతిపై విచారణ జరగాల్సి ఉందని పద్మ అన్నారు. రాజధాని భూముల బాగోతంపైనా, ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుని, ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి తన బినామీలతో భూములను కొనిపించడంపైనా, సదావర్తి భూముల అవినీతిపైనా విచారణ జరగాల్సి ఉందని ఆమె అన్నారు.  రాజధాని భూములకు సంబంధించి అసెంబ్లీలో తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు పారిపోయారన్నారు. మీకు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు తన  ప్రతిష్టను పెంచుకోలేక ఎంత సేపూ జగన్ ప్రతిష్టను దెబ్బతీసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ఇది రాజకీయాల్లో చేతగాని తనానికి నిదర్శనమని పద్మ పేర్కొన్నారు. జగన్ విషయంలో ఏం జరగనుందో అది జరుగుతుంది, చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు సిద్ధపడటం లేదో చెప్పాలి అని పద్మ సూటిగా ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top