'సాధించలేమని చెంపలేసుకోండి'

'సాధించలేమని చెంపలేసుకోండి' - Sakshi


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని బుధవారం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికమంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ సందర్భంగా వారు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎందుకు అల్టిమేటం ఇవ్వరని వారు ప్రశ్నించారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు భవిష్యత్తు కంటే తనపై ఉన్న కేసులు, కేంద్రంలో మంత్రి పదవులు, తన స్వార్థ రాజకీయాలే ముఖ్యమా అని వారు చంద్రబాబును నిలదీశారు.      



ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాటం అయినా చేయాలి లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని... దానిని సాధించలేనని ప్రజల ముందుకు వచ్చి చెంపలేసుకోవాలని సూచించారు. హోదా రాకపోవడానికి చంద్రబాబు మెతక వైఖరే కారణమని వారు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఆయన పూటకో ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు. గత రెండేళ్లుగా అటు టీడీపీ... ఇటు బీజేపీ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసగించాయని చెప్పారు. ప్రత్యేక హోదా నిర్ణయం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని ఇంతవరకు చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హోదా ఇవ్వలేమని ధైర్యం చాలక అలా చెప్పారని వారు ఎద్దేవా చేశారు. విభజన సమయంలో ఏపీకి బీజేపీనే దిక్కు అనే విధంగా వెంకయ్య నాయుడు ప్రజల్లో భ్రమలు కలిగించే విధంగా మాట్లాడారని... అలాగే రాష్ట్రంలో టీడీపీ వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని ప్రకటనలు గుప్పించి.. తీరా అధికారంలోకి వచ్చాక రెండు పార్టీలు ప్రజలను దారుణంగా మోసగించాయన్నారు. ప్రజసామ్యంలో ఇంతకంటే పెద్ద నేరం మరోకటి లేదని వారు అభిప్రాయపడ్డారు.



ఓ వైపు కేంద్ర ప్రభుత్వంలో తన పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులను కొనసాగిస్తున్నా టీడీపీ... మరోవైపు బీజేపీకి చెందిన ఇద్దరిని రాష్ట్రంలో తన మంత్రివర్గంలో కొనసాగిస్తున్న చంద్రబాబు కేంద్రంపై రాజీలేని పోరాటం ఎలా చేస్తారో ప్రజలకు వివరించాలని వారు డిమాండ్ చేశారు. అల్టిమేటం ఇవ్వని పక్షంలో చంద్రబాబు ఆడుతున్నది ఓ డ్రామా అని అందరికీ అర్ధమౌతోందన్నారు.



రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఈ సమస్యను చంద్రబాబు ఎందుకు ఎన్డీఏ పక్షాలు, కేంద్రంలోని  ఇతర రాజకీయ పక్షాల దృష్టికి తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇది నూటికి నూరు పాళ్లూ చంద్రబాబు వైఫల్యమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరికీ తలవంచని రాష్ట్రం అని ఇంతకాలం దేశం యావత్తూ భావించిందని... కానీ చంద్రబాబు ఇవాళ తన కేసుల కోసం, తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర పరువును ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటానికే పుట్టామని పదే పదే చెప్పుకునే ఈ పార్టీ నేతలు, కేంద్రంలోని మంత్రులు ఈ రోజు కేంద్ర చెప్పినదానికల్లా డూడూ బసవన్నల్లా తలూపుతున్నారని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే చంద్రబాబును నమ్మని పరిస్థితి త్వరలోనే వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదాపై తన వైఖరి ఏమిటో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నోరి తెరిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top