మొబైల్స్‌పై వ్యాట్ 5 శాతానికి తగ్గింపు

మొబైల్స్‌పై వ్యాట్ 5 శాతానికి తగ్గింపు


వ్యాట్ చట్టంలో సవరణ.. ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 5 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం వ్యాట్ చట్టంలో సవరణ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇస్తూ గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం.186) జారీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొబైల్‌పై 5 శాతమే పన్ను విధిస్తుండగా, తెలంగాణలో మాత్రం 14.5 శాతం వసూలు చేస్తున్నారని, దీంతో మొబైల్ తయారీ కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.



2015 సెప్టెంబర్‌లో ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మొహిండ్రూ సీఎం కేసీఆర్‌ను, అప్పటి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలసి వ్యాట్‌ను తగ్గించాలని కోరారు. ఈ మేరకు సీఎంవో పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకుని దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న పన్ను విధానాన్ని పరిశీలించింది. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల మీదా 5 శాతం పన్నే విధిస్తున్నందున మొబైల్ మీద కూడా అదే పన్ను విధానాన్ని అమలు చేయాలని అధికారులు సూచించారు. దీంతో చట్టంలో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

ఏడాదికో తీరు?

2014 మే 17న రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా అభ్యంతరాల మేరకు 5 శాతం పన్ను విధించేందుకు అనుమతిస్తూ వివరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 సెప్టెంబర్ 20న ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన మెమోను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మొబైల్‌పై 14.5 శాతం పన్ను విధానం కొనసాగుతోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top