అభద్రతతోనే తప్పుడు సర్వేలు

అభద్రతతోనే తప్పుడు సర్వేలు - Sakshi


సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం, లుకలుకలతో అభద్రత నెలకొం దని, దీనిపై అందరినీ భ్రమల్లో పెట్టడానికే సీఎం కేసీఆర్ బోగస్ సర్వేలు చేయించుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ నేతలు నంది ఎల్లయ్య, టి.జగ్గారెడ్డి, వినోద్‌రెడ్డితో కలసి శనివారం గాంధీ భవన్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తప్పుడు ప్రచారంతో గోబెల్స్‌ను మించిపోయేలా ఉన్నారన్నారు. ‘‘సర్వేపై కేసీఆర్‌కు విశ్వాసముంటే వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 25 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయించడానికి ఎందుకు భయపడుతున్నట్టు? అనర్హత వేటు వేయకుండా హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఎందుకు పోతున్నట్టు? గెలుస్తామనే నమ్మకం కేసీఆర్‌కు ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి’’ అని ఉత్తమ్ సవాల్ విసిరారు.



ఎన్నికల బరిలో దిగితే ప్రజలే కేసీఆర్‌కు సరైన గుణపాఠం చెబుతారన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. రుణమాఫీ చేయకున్నా రైతులు సంతోషంగా ఉన్నట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టకున్నా ప్రజలంతా అనుకూలంగా ఉన్నట్లు, విద్యార్థులకు ఫీజులు ఇవ్వకున్నా బాధపడట్లేదన్నట్లు చెబితే ఎవరైనా నమ్ముతారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. అమలుకాని సంక్షేమ పథకాలపై సంతోషంగా ఉన్నట్లుగా చూపిన సర్వే పూర్తిగా బోగస్ అన్నారు.



కేసీఆర్ మాటలు, చేతలకు పొంతనలేదని, ఆయన నిర్ణయాలు, మాటలన్నీ పిచ్చి తుగ్లక్‌ను గుర్తుకు తెస్తున్నాయని గ్రామాల్లో ప్రజలూ అనుకుంటున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబానికి బుద్ధి చెప్పే అవకాశం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి 80 సీట్లు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌పై భ్రమలు తొలగిపోతున్నాయని, భవిష్యత్తులో ఆ పార్టీకి మరింత దెబ్బ తప్పతని హెచ్చరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top