రాజీవ్‌ దూరదృష్టితోనే సాంకేతిక విప్లవం: ఉత్తమ్‌

రాజీవ్‌ దూరదృష్టితోనే సాంకేతిక విప్లవం: ఉత్తమ్‌ - Sakshi

గాంధీభవన్‌లో రాజీవ్‌ జయంతి వేడుకలు 

 

సాక్షి, హైదరాబాద్‌:  ఈ రోజు దేశంలోని ప్రతీ వ్యక్తికి సెల్‌ఫోన్, కంప్యూటర్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయంటే దానికి దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ దూరదృష్టే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌ దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లారన్నారు. రాజీవ్‌ జయంతి వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ, నెహ్రూ కుటుంబాల ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ప్రస్తుత పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.



దేశంలో లౌకిక వాదానికి ప్రమాదం ఏర్పడిందని, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ.. ఏం తినాలో, ఎలాంటి బట్టలు కట్టుకోవాలో ప్రభుత్వమే నిర్ణయించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమాల్లో సేవాదళ్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ, మాజీమంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాజీవ్‌ జయంతిని పురస్కరించుకొని సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి ఉత్తమ్, ఇతర కాంగ్రెస్‌ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకు ముందు అబిడ్స్‌ నుంచి సోమాజిగూడ వరకు సద్భావన యాత్ర నిర్వహించారు.

 

ఢిల్లీలో నేతల నివాళి 

సాక్షి, న్యూఢిల్లీ: రాజీవ్‌ జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆయనకు ఘనంగా నివాళులార్పించారు. పొన్నాల లక్ష్మయ్య, బలరాంనాయక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య తదితరులు రాజీవ్‌ సమాధి ఉన్న వీర్‌ భూమికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు.   
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top