అబద్ధాలు.. చిల్లర మాటలు: ఉత్తమ్

అబద్ధాలు.. చిల్లర మాటలు: ఉత్తమ్ - Sakshi


- దేశ సరిహద్దులో ప్రాణాలొడ్డి యుద్ధం చేశా..

- జైళ్లకు, తుపాకులకు భయపడతానా?



సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత ప్రాజెక్టును కట్టడానికి 16 అనుమతులు వచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు దాచిపెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం అబద్ధాలతో చిల్లర మాటలు మాట్లాడుతూ, స్థాయిని దిగజార్చుకుని అసభ్య పదజాలాన్ని వాడితే వాస్తవాలు మారిపోతాయా నిలదీశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, ఎం.రంగారెడ్డి, కొనగల మహేశ్‌తో కలిసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలో కేవలం 3 వేల ఎకరాల ముంపు కోసం ఒప్పించలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తారా అని దుయ్యబట్టారు.



ప్రాణహితను తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులోనే కట్టాలని సీఎం కేసీఆర్ నియమించిన ఇంజనీర్లే నివేదిక ఇచ్చారన్నారు. ఆ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ ద్వారా పంపిస్తామని వెల్లడించారు. ‘‘మహారాష్ట్రలో కేవలం 3 వేల ఎకరాల ముంపుతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహితను ప్రతిపాదించాం. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం రూ.38 వేల కోట్లు. విద్యుత్‌కు కూడా చాలా తక్కువ. నిర్వహణ వ్యయం శాశ్వతంగా తగ్గుతుంది. దీనికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 16 అనుమతులు వచ్చాయి. ఇందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఒప్పించలేక, ఆ రాష్ట్ర పాదాల దగ్గర తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? అనుచితంగా మాట్లాడి.. జైల్లో మూసేస్తామని, తుపాకులతో కాల్చివేస్తామని కేసీఆర్ మాట్లాడితే నేను భయపడను’’ అని ఉత్తమ్ అన్నారు.



‘‘దేశ సరిహద్దులో ప్రాణాలొడ్డి యుద్ధంలో పోరాటం చేసిన. నీలాగా అబద్ధాలు చేసి, మోసాలు చేసి రాజకీయాల్లోకి రాలే దు’’ అంటూ కేసీఆర్‌ను విమర్శించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేశారని, కేవలం ఒక్క టీఆర్‌ఎస్ ఎంపీతో తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై నోరు పారేసుకోవడం సరికాదన్నారు. ప్రాణహితను తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్ల కరెంటు అవసరాలు పెరుగుతాయని, ప్రాజెక్టు అంచనా వ్యయం, నిర్వహణ భారం పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలకు నష్టం చేస్తున్న ప్రాజెక్టు గురించి ప్రతిపక్ష పార్టీలతో చర్చించడానికి భయమెందుకని ప్రశ్నించారు. ప్రజలకు నష్టం చేయకుంటే డీపీఆర్‌ను ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు చెబుతామని, సీఎం చేస్తున్న మోసాన్ని ఎండగడతామని హెచ్చరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top