సైన్యం రక్తంతో బీజేపీ రాజకీయం

రాజీవ్‌గాంధీ సద్భావన యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ , వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి, జానా - Sakshi


ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ విమర్శ

ఫిరాయింపులపై టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు తప్పదు: ఉత్తమ్

పాతబస్తీలో టీపీసీసీ 26వ సద్భావనాయాత్ర


 సాక్షి, హైదరాబాద్: భారత సైన్యం రక్తంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. బుధవారం పాతబస్తీలోని చార్మినార్‌వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో 26వ రాజీవ్ సద్భావనాయాత్ర జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, కొప్పుల రాజు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దిగ్విజయ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పేరు చెప్పకుండా ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి బీజేపీకి లేదన్నారు.


భారత సైనికుల త్యాగాలు, పాకిస్తాన్‌తో కయ్యం గురించి మాట్లాడకుండా ఎన్నికల్లో గెలిచే అవకాశం ఆ పార్టీకి లేకుండా పోయిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సర్జికల్ స్ట్రైక్‌ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దీనిని ప్రచార అస్త్రంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. అన్ని మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఒక్కటేనని రాజీవ్‌గాంధీ చూపించిన సద్భావనే దేశానికి రక్ష అని అన్నారు. రాష్ట్రంలో కూడా అప్రజాస్వామిక, నియంతపాలన నడుస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.


ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేవిధంగా రాష్ట్రంలో పాలన ఉందన్నారు. వ్యాపారాలకోసం, స్వంత ప్రయోజనాలకోసమే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. అలాంటివారు పార్టీ మారినంతమాత్రాన కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు.  ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లామని, అక్కడ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మతోన్మాదశక్తుల అంతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సూచించారు.


బీజేపీ నేతలు గోముఖ వ్యాఘ్రాల వంటివారని కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. కామన్ సివిల్‌కోడ్‌ను ముందుగా హిందువుల్లో తీసుకురావాలని, బహుభార్య విధానం హిందువుల్లోనే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. భారత సైన్యానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా రాజీవ్‌గాంధీ చేసిన పోరాటాన్ని దేశం మరచిపోదని షబ్బీర్ అలీ అన్నారు. కేంద్రంలో బీజేపీ, ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత మతతత్వ శక్తులు మళ్లీ రెచ్చిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ రాజీవ్ 26వ సద్భావనా అవార్డును జస్టిస్ ఎం.ఎన్.రావుకు ప్రధానం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top