ఇంత ఘోరం ఏనాడూ లేదు

ఇంత ఘోరం ఏనాడూ లేదు - Sakshi


మల్లన్నసాగర్ ఘటనలపై ఉత్తమ్

 

 సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు వెళ్లకుండా పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారని, బాధితులను కలవనీయకుండా అడ్డుకునే ఇలాంటి అప్రజాస్వామిక ఘోరం ఏనాడూ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు.శనివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని కోరితే పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు. నిర్వాసితులను పరామర్శించడానికి, వారికి న్యాయం దక్కడానికి ప్రయత్నాలు చేస్తున్న విపక్షాలకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించడం దారుణమని విమర్శించారు.



మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో వాస్తవంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.గోదావరి నదిలో 120 రోజుల పాటు వరద వస్తుందని, పంట పూర్తయ్యేదాకా వరద వస్తున్నప్పుడు ఎత్తిపోతలకు అవకాశం ఉందన్నారు. ఎత్తిపోతలకు అవకాశం ఉన్నప్పుడు 50 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌ను నిర్మించాల్సిన అవసరం ఏముందని ఉత్తమ్‌కుమార్  ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బయటపెట్టాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. డీపీఆర్‌ను దాచిపెట్టి, సీఎం కేసీఆర్ తన ఇంటికి సంబంధించిన వ్యవహారంలాగా చేస్తున్నారని ధ్వజమెత్తారు.



భూములకోసం, పునరావాసంకోసం పోరాడుతున్న నిర్వాసితులను మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు బెదిరిస్తున్నారన్నారు. ఆ గ్రామాల్లోకి ఎవరు వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. మల్లన్నసాగర్ వెళ్లడానికి సిద్ధమైన కాంగ్రెస్‌నేతలను గాంధీభవన్‌లోనే అరెస్టు చేశారని, న్యాయవాదులనూ వదల్లేదని , నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులపైకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ కారును ఎక్కించడం వంటి చర్యలన్నీ అప్రజాస్వామ్యానికి, అరాచకానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి వైదొలగాలని డిమాండ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top