ఆప్‌ కే app

ఆప్‌ కే app


స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. నో ఫికర్ అంటున్నారు హైదరాబాదీలు.  అప్‌డేటెడ్ అప్లికేషన్లతో అదరగొడుతున్న మొబైల్స్ స్మార్ట్ సిటీలో దిక్సూచిలా పనిచేస్తున్నాయి. ప్లేస్టోర్స్‌లో ప్రత్యక్షమవుతున్న మొబైల్ అప్లికేషన్స్.. మేమున్నామని భరోసానిస్తున్నాయి. ఎల్లలు దాటి విస్తరిస్తున్న మెగాసిటీని అరచేతిలో పెట్టేస్తున్నాయి. కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తూ నగరవాసుల నయా నేస్తాల్లా మారిపోతున్నాయి ఈ మొబైల్ అప్లికేషన్లు. అవసరానికి ఉపయోగపడేవి కొన్ని.. ఆపదలో ఆదుకునేవి మరికొన్ని.. ఇలా రకరకాల యాప్స్ సిటీలైఫ్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేస్తున్నాయి.  

 

 సాక్షి అభయ



స్నేక్‌గ్యాంగ్‌లు, కీచకుల స్వైరవిహారంతో నగరంలో అమ్మాయిలకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ‘సాక్షి’ అభయ అప్లికేషన్ మిమ్మల్ని ఓ అన్నగా ఆదుకుంటుంది. ఇది ఫోన్‌లో ఉంటే.. అడవాళ్లకు కొండంత ధైర్యం వస్తుంది. ఆపదలోఉన్నప్పుడు ఈ అప్లికేషన్ బటన్ నొక్కితే చాలు.. ఆటోమేటిక్‌గా మీరున్న పరిస్థితులను రికార్డు చేసి మీ సంబంధీకులకు సమాచారం చేరవేస్తుంది. అంతేకాదు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు కూడా సందేశాన్ని పంపి అలర్ట్ చేస్తుంది.

 

చిటికెలో సిటీ టూర్




సింగిల్ క్లిక్‌తో సిటీని చూడాలంటే ఈ అప్లికేషన్ (హైదరాబాద్ సిటీ టూర్) ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. చార్మినార్ టు గోల్కొండ, బిర్లామందిర్ టు చిలుకూరు వరకు నగరానికి చెందిన అన్ని టూరిస్ట్ స్పాట్స్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. మై సిటీ వే, ట్రావెల్ హైదరాబాద్ కూడా ఇలాంటిదే.

 

అర్జంట్‌గా రక్తం కావాల్సి ఉందా.. సిటీబస్సు నంబర్లు కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయా.. టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్‌లో కొన్ని అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు మన నగరం మన మునివేళ్లపై ఉన్నట్టే. గోల్కొండ హిస్టరీ నుంచి ప్యారడైజ్ బిర్యానీ టేస్టు వరకు, ఆర్టీసీ బస్సు నంబర్ల నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్స్ టైమ్ వరకు అన్నింటినీ మన ముందుంచుతాయి ఈ  హైదరాబాద్ బేస్డ్ అప్లికేషన్‌లు. ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. అప్లికేషన్‌లో హైదరాబాద్ మరింత క్లోజ్‌గా కనిపిస్తుంది.

 

మెట్రో కన్నా ముందే..




హైదరాబాదీల కలల రైలు మెట్రో. ఈ ట్రైన్ పట్టాలెక్కకముందే.. దీని వివరాలు కావాలంటే మెట్రోరైల్ యాప్ మీ ఫోన్‌లో ఉండాల్సిందే. మెట్రో పనులు, స్టేషన్లు తదితర సమాచారమంతా ఇందులో అప్‌డేట్ చేస్తుంటారు.

 (ఇది అనధికార అప్లికేషన్)

 

తాజా ధరలు..




మహానగరంలో కూరగాయల రేట్లు.. షేర్‌మార్కెట్‌లా నిలకడ లేకుండా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. రైతుబజార్ అప్లికేషన్ ఉంటే మార్కెట్‌కు వెళ్లి బేరమాడాల్సిన పని ఉండదు. సిటీలోని రైతుబజార్లలో తాజా కూరగాయల రేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నచ్చిన ధరలో ఉన్న మెచ్చిన కూరగాయలు కొనుక్కోవచ్చు.



 ఆర్టీసీ ఇన్ఫో



ఏ నంబర్ బస్సు ఏ రూట్లో వెళ్తుందో సిటీలో ఉన్నవాళ్లకే సరిగా తెలియదు. ఇక నగరానికి కొత్తగా వచ్చేవారు తమ గమ్యస్థానానికి చేరడంలో పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితుల్లో మీకు హైదరాబాద్ ఆర్టీసీ ఇన్ఫో అద్భుతంగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ బస్‌రూట్స్ చెక్ అప్లికేషన్ కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పిస్తుంది.



బ్లడ్ బ్యాంక్స్



అర్జెంట్‌గా రక్తం అవసరం అయినపుడు ఆపద్బంధువు హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్  డిటెయిల్స్ యాప్. జంటనగరాల పరిధిలోని బ్లడ్ బ్యాంకుల సమగ్ర వివరాలు అడ్రస్‌తో సహా ఒక్క క్షణంలో మన ముందుంచుతుంది.

 అదిరే రుచులు  హైదరాబాద్ అంటే రుచులకు కేరాఫ్ అడ్రస్. సిటీ టేస్టీలను పరిచయం చేసే యాప్ జుమాటో. బిర్యానీ ఏ రెస్టారెంట్లో

అదిరిపోతుందో తెలిసిపోతుంది. టిఫిన్లకు బెస్ట్ హోటల్ ఏంటో గైడ్ చేస్తుంది. ఏ స్ట్రీట్‌లో ఏ రెస్టారెంట్ ఫేమస్ అనేది కూడా చెబుతుంది. హైదరాబాద్ బ్యాంక్స్ అండ్ ఏటీఎం లొకేటర్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సిటీలో ఏ బ్యాంక్ ఏటీఎం ఏ గల్లీలో ఉందో ఇట్టే కనిపెట్టేయవచ్చు.

 

 ఎంఎంటీఎస్ గైడ్..



 లోకల్ రైళ్లు ఏ టైంకు వస్తాయో గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం. ఈ ట్రైన్స్ టైమింగ్స్ కూడా తరుచూ మారిపోతూ కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. ఈ ప్రాబ్లమ్‌కు రెడ్ సిగ్నల్  చూపిస్తోంది హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్ టైమింగ్స్ అప్లికేషన్. ఇదుంటే ఎప్పటికప్పుడు ఎంఎంటీఎస్

 టైమింగ్స్ తెలుసుకోవచ్చు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top